పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న ఎంపీడీవోలు 312 మంది దాకా ఉండగా అందుకు అవకాశం ఉన్న పోస్టులు 13 మాత్రమే ఉండడంతో పాటు సీనియారిటీ జాబితా తయారీలో వివాదాల కారణంగా పాతికేళ్లుగా ఎంపీడీవోలకు పదోన్నతుల అంశం అపరిష్కృతంగా మిగిలింది.
మండలాల వ్యవస్థ ఏర్పాటైన తర్వాత ఎంపీడీవోల నియామకం, సర్వీసు రూల్స్‌పై విధివిధానాలు ఖరారు కాకపోవడంతో ఒకేసారి పెద్ద ఎత్తున పదోన్నతులు కల్పించాల్సిన పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వాలు దీనిపై చొరవ చూపకపోవడంతో సమస్య మరుగున పడింది. ముఖ్యమంత్రిగా వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే దీనిపై దృష్టి సారించి తొలుత ఐఏఎస్ అధికారులతో కమిటీని నియమించారు.
అయితే ఇక్కడ కొలిక్కిరాకపోవడంతో సీఎం జగన్ ఈ బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. ఈక్రమంలో వీలైనంత మంది ఎంపీడీవోలకు ఒకేసారి పదన్నోతులు కల్పించేందుకు ప్రత్యేకంగా 200 పోస్టులను గుర్తించారు. ఎంపీడీవోల పదోన్నతుల కోసమే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో 51 డీఎల్‌డీవో పోస్టులు కొత్తగా మంజూరు చేస్తూ 2020లో ఉత్తర్వులు జారీ చేశారు.
వీటికి తోడు 149 పోస్టుల్లో ఆన్‌డ్యూటీ లేదా డిప్యుటేషన్ రూపంలో ప్రత్యేకంగా ఎంపీడీవోలకు మాత్రమే పదోన్నతులకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం 2022 జనవరి 17వ తేదీన మరో ఉత్తర్వులు జారీ చేసింది.