ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తల్లిదండ్రుల బీమాలో వివాహమైన కుమార్తెలు కూడా అర్హులే

national |  Suryaa Desk  | Published : Sat, Aug 13, 2022, 02:31 AM

బీమా నష్టపరిహారం పొందే సంతానం విషయంలో ఎన్నో చిక్కులు వస్తుంటాయి. వివాదాలు తలెత్తుతుంటాయి. అలాంటి వివాదాలకు కర్ణాటక హైకోర్టు చెక్ పెడుతూ ఓ కీలక తీర్పు ఇచ్చింది. ప్రమాదాల్లో తల్లిదండ్రులు మరణించినప్పుడు లభించే బీమా పరిహారం విషయంలో వివాహిత కుమార్తెల అర్హతకు సంబంధించి కర్ణాటక హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. బీమా పరిహారాన్ని అందుకునేందుకు వివాహిత కుమార్తెలు కూడా అర్హులేనని స్పష్టం చేసింది. వివాహిత కుమారులు తల్లిదండ్రుల బీమా పరిహారం అందుకోడానికి అర్హులని సుప్రీంకోర్టు చెప్పిందని, ఇది కుమార్తెలకు కూడా వర్తిస్తుందని పేర్కొంది. ‘‘ఈ కోర్టు కూడా వారు వివాహిత కుమారులు లేదా వివాహిత కుమార్తెలు అనే వివక్ష చూపలేదు.. అందువల్ల, మరణించిన వారి వివాహిత కుమార్తెలు పరిహారం కోసం అర్హులు కాదనే వాదనను అంగీకరించలేం’’ అని జస్టిస్ హెచ్‌పీ సందేశ్ ఏకసభ్య ధర్మాసనం తేల్చిచెప్పింది.


కర్ణాటకకు చెందిన రేణుక (57) అనే మహిళ 2012 ఏప్రిల్ 12న హుబ్బళ్లి సమీపంలోని యమనూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో పరిహారం కోసం రేణుక భర్త, కుమారుడు, ఆమె ముగ్గురు కుమార్తెలు బీమా సంస్థను ఆశ్రయించారు. అయితే, వివాహితులైన కుమార్తెలకు పరిహారం ఇవ్వడం కుదరదని బీమా సంస్థ చెప్పడంతో మోటార్ యాక్సిడెంట్స్ క్లైమ్స్ ట్రైబ్యునల్‌ ను ఆశ్రయించారు. వారికి సాలీనా ఆరు శాతం వడ్డీతో రూ.5,91,600 చెల్లించాలని ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చింది.


దీనిని హైకోర్టులో సవాల్ చేసిన సదరు బీమా సంస్ధ.. వివాహిత కుమార్తెలు పరిహారానికి అర్హులు కాదని, వారు కుటుంబంపై ఆధారపడిలేరని వాదించింది. కాబట్టి 'ఆధారం కోల్పోవడం' అనే నిబంధన కింద పరిహారం ఇవ్వడం తప్పు అని బీమా సంస్థ పేర్కొంది. అయితే, కోర్టు మాత్రం ట్రైబ్యునల్ తీర్పును సమర్ధించింది. ఈ సందర్భంగా జస్టిస్ హెచ్‌పీ సందేశ్ మాట్లాడుతూ.. ‘‘ఆధారపడటం అంటే కేవలం ఆర్థికంగానే కాదు... పరిహారాన్ని క్లెయిమ్ చేయడానికి డిపెండెన్సీ సంబంధిత ప్రమాణం అయినప్పటికీ ఇది 'ఒప్పందం' అని అర్థం కాదు.. డిపెండెన్సీలో భౌతిక, భావోద్వేగ, మానసిక అనుబంధాలు ఉంటాయి.. వీటిని డబ్బు పరంగా ఎప్పటికీ సమం చేయలేం’’ పేర్కొంది. మరణించిన వారి వయసు, ఆమె ఆదాయంపై సందేహాలతో సహా బీమా కంపెనీ ఇతర వివాదాలను కూడా కోర్టు తిరస్కరించింది. ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com