పరిగెత్తే పిల్లవాడ్ని కూడా చేయి పట్టి నడిపించడం ఎందుకు అంటూ సంక్షేమ పథకాలపై తనకున్న అభిప్రాయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తంచేశారు. జనసేన ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ఐటీ విభాగం సదస్సుకు అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిజంగా మనస్ఫూర్తిగా అభివృద్ధి చేస్తే ఆంధ్రప్రదేశ్ చాలా గొప్పస్థాయికి వెళుతుందని అన్నారు. కానీ ఆ విధంగా ఆలోచించే కీలకమైన నాయకులు లేరని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
"సంక్షేమ పథకాలకు నేను వ్యతిరేకం కాదు. కానీ నువ్వు సంక్షేమ పథకాల మీదే వ్యవస్థను నడుపుతానంటే... అది ప్రజలను బలోపేతం చేసినట్టు కాదు, ప్రజలను బలహీనులుగా తయారుచేస్తున్నట్టే. సంక్షేమ పథకాలు ఎప్పుడంటే... నడవలేని పిల్లవాడ్ని చేయి పట్టుకుని నడిపించాలి. పరిగెత్తే పిల్లవాడ్ని కూడా చేయి పట్టి నడిపించడం ఎందుకు? వాళ్లను వదిలేసెయ్" అంటూ పవన్ కల్యాణ్ హితవు పలికారు.