ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మధ‌్య పొలిటికల్ వార్ ఎలా సాగుతుందో అందరికీ తెలిసిందే. ఆ వార్ ఛాయలు రాజ్ భవన్ లో సైతం స్పష్టంగా కనిపించాయి. విజయవాడలోని రాజ్ భవన్ లో ఇవాళ ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆతిథ్యమిచ్చారు. గవర్నర్ ఆహ్వానం అందుకుని ఎట్ హోమ్ కు విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, విపక్ష నేత చంద్రబాబు దూరం దూరంగానే ఉన్నారు. ఎక్కడా ఒకరికొకరు ఎదురుపడలేదు. సతీసమేతంగా విచ్చేసిన సీఎం జగన్ గవర్నర్ తో కలిసి ఓ టేబుల్ వద్ద కూర్చోగా, టీడీపీ నేతలతో కలిసి చంద్రబాబు మరో టేబుల్ వద్ద కూర్చున్న దృశ్యాలు కనిపించాయి.
అసెంబ్లీలో తప్ప జగన్, చంద్రబాబు ఒకే వేదికపై కనిపించడం చాలా అరుదైన విషయం. దాంతో మీడియా దృష్టంతా ఈ ఎట్ హోమ్ కార్యక్రమంపైనే నిలిచింది. అయితే వీరిద్దరూ పరస్పరం ఎదురుపడకుండానే కార్యక్రమం నుంచి వెనుదిరిగారు. ఎట్ హోమ్ కార్యక్రమానికి ఏపీ మంత్రుల్లో పలువురు హాజరయ్యారు.