మొన్నటి వరకు కర్ణాటక రాష్ట్రాన్ని హిజాబ్ వివాదం కుదిపేసినా తాజాగా పోస్టర్ల వివాదం మొదలైంది. మొన్నటి వరకు టిప్పుల్ సుల్తాన్ పోస్టర్ వ్యవహారం రాజకీయ దుమారం రేపగా తాజాగా సావర్కర్ పోస్టర్ కలకలానికి దారితీసింది. కర్ణాటకలో మరోసారి ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది. సావర్కర్ పోస్టర్ కేంద్రంగా వివాదం రాజుకుంది. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శివమొగ్గలోని గాంధీ బజార్ ప్రాంతంలో అమీర్ అహ్మద్ సర్కిల్లో వీర్ సావర్కర్ పోస్టర్ వేశారు. ఆ పోస్టర్ గొడవకు కేంద్ర బిందువైంది. హిందూ గ్రూప్స్ కావాలనే ఆ పోస్టర్‌ను ఏర్పాటు చేశాయని దానికి వ్యతిరేకంగా కొందరు ముస్లిం యువత ఆందోళనకు దిగారు. సావర్కర్ పోస్టర్ అక్కడ నుంచి తొలగించేందుకు ప్రయత్నించారు. దాంతో హిందూ సంస్థలు ఆందోళనకు దిగారు.
ఈ వివాదం చెలరేగిన కొన్ని గంటల తర్వాత శివమొగ్గలోని గాంధీ బజార్ ప్రాంతంలో ఒకరిని కత్తితో పొడిచారు. బాధితుడు ప్రేమ్ సింగ్‌గా గుర్తించారు. బాధితుడిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ దాడిని ఎందుకు చేశారో తెలియరాలేదు. కానీ శివమొగ్గలో జరుగుతున్న సావర్కర్ పోస్టర్ వల్లే కత్తి పోటు ఘటన చోటుచేసుకుందని కర్ణాటక హోంమంత్రి అనుమానం వ్యక్తం చేశారు.
అయితే ఈ ఘటనతో పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. శివమొగ్గ జిల్లాలో కర్ఫ్యూ విధించారు. చాలా ప్రాంతాల్లో షాపులు మూయించేశారు. అలాగే మంగళూరులోని సూరత్కల్ జంక్షన్లో ఇలాంటి ఓ ఘటన చోటుచేసుకుంది. మంగళూరులోని సూరత్కల్ జంక్షన్లో హిందూత్వ సిద్ధాంతకర్త సావర్కర్ పేరు మీద ఓ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. అయితే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో దానిని తొలగించారు.
కర్ణాటకలో ఆదివారం టిప్పు సుల్తాన్ పోస్టర్ కూడా రగడ చోటుచేసుకుంది. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బెంగళూర్‌లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన టిప్పు సుల్తాన్ పోస్టర్ ఏర్పాటు చేశారు. అయితే దానిని గుర్తు తెలియని వ్యక్తులు చించిపడేశారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. ఈ చర్యను కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఎవరో విధ్వంసం సృష్టించేందుకే ఇలా చేశారని ఆరోపణలు చేశారు. అయితే గతంలో కూడా ఆ రాష్ట్రంలో టిప్పు సుల్తాన్‌పై అనే వివాదాలు చోటుచేసుకున్నాయి. కొంతమంది టిప్పు సుల్తాన్‌ను దేశ ద్రోహిగా అభివర్ణిస్తారు.