భారతదేశ స్వాతంత్య్ర వేడుకల్లో ఈ సారి కలకత్తాలో ఓ ఆసక్తికర పరిణామం నెలకొంది. ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన మమతా బెనర్జీ ఓ పాటకు డాన్స్ వేశారు. అందర్నీ ఆర్చర్యానికి గురిచేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం కోల్‌కతాలో జరిగిన స్వతంత్ర దినోత్సవంలో పాల్గొన్నారు. జానపద కళాకారులతో కలసి డ్యాన్స్ చేశారు. కొంత సమయం పాటు ఇతర కళాకారులతో కలసి లయబద్ధంగా నృత్యం చేశారు. ఎప్పుడూ ఫైర్ బ్రాండ్ కనిపించే మమతా బెనర్జీ ఇలా స్టెప్పులు వేయడం అందరిని అబ్బురపరిచింది. అలాగే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డ్యాన్స్ చేస్తున్న సమయంలో అక్కడున్న వారంతా లేచి నిల్చుని అభినందనలు తెలిపారు. ఇక స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సోమవారం మమతా బెనర్జీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్ర పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆకలి వెతలు లేని దేశంగా మారాలని ఆకాంక్షించారు. ఎవరూ ఆకలితో అలమటించని, మహిళలు భద్రంగా ఉండే దేశాన్ని నిర్మించాలని అన్నారు. అంతేకాదు మన వారసత్వ ఫలాలను ఆకాంక్షలను ముందు తరాల వారికి అందించేందుకు మనం పునరంకితం కావాలని అన్నారు. దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు చెబుతూ మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. 75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్రవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు చేసినట్టు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ముఖ్యంగా రెడ్ రోడ్‌ను మూడు జోన్‌లుగా విభజించి.. దాదాపు 1200 మంది పోలీసులు మోహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఫుల్‌బరీలోని ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులో సరిహద్దు భద్రతా దళం, బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. రాష్ట్రంలోని ముఖ్య నగరాల్లో కూడా మువ్వెన్నల జెండాను ఎగురవేశారు.