ఉక్రెయిన్ ప్రజలు మనోవేధనకు ప్రస్తుత పరిస్థితి ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఉక్రెయిన్‌లో సమాధులు తవ్వుతున్నారు. అక్కడి ప్రజలు ఇప్పుడు సమాధులు తవ్వే కార్యక్రమంలోనే ఉన్నారు. అదేంటి అనుకుంటున్నారా..? అవును రష్యా చేసిన దాడులతో ఉక్కిరిబిక్కిరైన ఉక్రెయిన్ ప్రజలు ఒక సమయలో చనిపోయిన తమ బంధువులు, సహచరుల మృతదేహాలను హడావిడిగా ఖననం చేశారు. ఎక్కడబడితే అక్కడ పూడ్చి పెట్టేశారు. ఎవరూ సక్రమంగా తమ వారికి తుది వీడ్కోలు పలకలేక పోయారు. ఆ రణరంగంలో కనీసం కంటి నిండా ఏడ్వడానికి కూడా ఎవరికీ అవకాశం లేకపోయింది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని... పరుగులు తీశారు. చనిపోయిన తమ వారిని ఉన్న చోటే.. సామూహికంగా పూడ్చేయాల్సిన దుస్థితి.
అయితే ఇప్పుడు అక్కడ కొంచెం పరిస్థితి మెరుగైంది. దాంతో లుహాన్స్క్ రీజియన్‌లోని రూబిజ్నే పట్టణ ప్రజలు.. యుద్ధం జరుగుతున్న సమయంలో ఖననం చేయించిన మృతదేహాలను బయటకు వెలికి తీస్తున్నారు. వాటికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పట్టణంలో దాదాపు 50 వేల జనాభా ఉన్నారు. అయితే ఈ నగరం ప్రస్తుతం రష్యా మద్దతు కలిగిన లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ ఆధీనంలో ఉంది.
దీంతో ఇక్కడ ప్రజలు తమ వాళ్లకు ఘనంగా వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నారు. తవ్వకాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా యుద్ధం జరిగే టైంలో ధ్వంసమైన ఓ అపార్ట్‌మెంట్ బ్లాక్ వెలుపల ఇటీవల ఓ కందకాన్ని తిరిగి తవ్వారు. అందులో నుంచి ఆరు మృతదేహాలను వెలికితీశారు. ఈ క్రమంలోనే లిలియా అనే స్థానికురాలు.. తన తల్లి మృతదేహానికి చుట్టిన దుప్పటి ఆధారంగా ఆమెను గుర్తుపట్టింది. దాడుల టైంలో తన తల్లిదండ్రుల అపార్ట్‌మెంట్‌కు వెళ్లలేకపోయానని లిలియా వాపోయారు. అప్పుడు జరుగుతున్న దాడులతో దహన క్రియలను సరిగ్గా నిర్వహించలేకపోయామని, దాంతో ఆమె మృతదేహాన్ని బహిరంగ కందకంలో ఖననం చేయాల్సి వచ్చిందని లిలియా చెప్పారు. ఇప్పుడు ఆమె మృతదేహాన్ని శ్మశానవాటికలో పూడ్చుతామని చెప్పారు.
ప్రస్తుతం తూర్పు ఉక్రెయిన్‌లో లుహాన్క్స్ పీపుల్స్ రిపబ్లిక్ ఆధ్వర్యంలో ఈ డెడ్‌బాడీల వెలికితీత కార్యక్రమం సాగుతుంది. ఇటీవల రూబిజ్నేలో పది రోజుల్లో 104 డెడ్ బాడీలను వెలికి తీశారు. నగరంలో 500 వరకు సామూహిక సమాధులు ఉన్నట్టు అంచనా. అయితే గుర్తు తెలియని మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు.