చైనా, అమెరికా మధ‌్య వివాదం రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా చైనాను కవ్వించేలా అమెరికా మరోసారి తైవాన్ కు తన ప్రతినిధులను పంపింది. తైవాన్ విషయంలో చైనా హెచ్చరికలు, బెదిరింపులను అమెరికా ఏమాత్రం లెక్కచేయడం లేదు. ఆగస్టు తొలివారంలో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీతైవాన్ పర్యటనపై చైనా కన్నెర్రజేసిన విషయం తెలిసిందే. తాజాగా, చైనా కడుపు మండేలా మరో ప్రజాప్రతినిధుల బృందాన్ని తైవాన్‌కు అమెరికా పంపింది. ఆసియా పర్యటనలో భాగంగా మసాచుసెట్స్‌కు చెందిన డెమొక్రటిక్ సెనెటర్ ఎడ్ మార్కీ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం ఆదివారం తైవాన్‌లో అడుగుపెట్టింది. రెండు రోజులపాటు ఈ బృందం తైవాన్‌లో పర్యటించనుంది. అమెరికా- తైవాన్ సంబంధాలు, ప్రాంతీయ భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు తదితర అంశాలపై తమ బృందం చర్చిస్తుందని తైవాన్‌లోని అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది. తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్, విదేశాంగ మంత్రి జోసెఫ్ వ్యూలతో సమావేశమయ్యే అవకాశం ఉంది.
తైపీలో ఆదివారం అడుగుపెట్టిన అమెరికా బృందానికి అక్కడ ఘన స్వాగతం లభించింది. అలాగే, తైవాన్, అమెరికాల మధ్య స్నేహపూర్వక సంబంధాలకు ఈ పర్యటన మరొక సంకేతమని తైవాన్ విదేశాంగ శాఖ ప్రశంసలు గుప్పించింది. ‘చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతోన్న వేళ.. అమెరికా మరో పర్యటనను ఏర్పాటు చేసింది. డ్రాగన్ బెదిరింపులకు భయపడని స్నేహాన్ని ప్రదర్శిస్తోంది.. తైవాన్ పట్ల బలమైన మద్దతును చాటుతోంది’ అని ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇటీవల నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన తీవ్ర వివాదానికి దారితీసింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చైనా.. భారీ ఎత్తున సైనిక విన్యాసాలను నిర్వహించింది. తైవాన్ గగనతలంలోకి యుద్ధ విమానాలను పంపి కవ్వింపునకు దిగింది. అయితే, ఈ తాటాకు చప్పుళ్లకు భయపడబోమని తైవాన్ ఘాటుగానే స్పందించింది. నియమాల ఆధారిత అంతర్జాతీయ క్రమాన్ని పరిరక్షించేందుకు, తైవాన్ జలసంధి అంతటా భద్రత పరిరక్షణకు.. అమెరికా, జపాన్, భారత్‌తో సహా సమభావన కలిగిన దేశాలతో కలిసి పని చేస్తామని తైవాన్ ప్రకటించింది. ఈ క్రమంలోనే తమ స్వీయరక్షణ సామర్థ్యాల పెంపు ప్రక్రియను కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
‘ఇటీవల తైవాన్‌ను లక్ష్యంగా చేసుకుని చైనా నిర్వహించిన మిలటరీ డ్రిల్‌తో తైవాన్ జలసంధి అంతటా శాంతి, స్థిరత్వానికి తీవ్ర విఘాతం కలిగింది.. ఈ క్రమంలోనే.. ఇరు పక్షాలు సంయమనం పాటించాలని, యథాతథ స్థితిని మార్చేందుకు ఏకపక్ష చర్యలను నివారించాలని పిలుపునిచ్చిన భారత్ సహా 50కి పైగా దేశాలకు కృతజ్ఞతలు’ అని తెలిపింది.
ఇదిలావుంటే తైవాన్ విషయంలో చైనా దుందుడుకు చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం కూడా 11 చైనా యుద్ధ విమానాలు తైవాన్ జలసంధి మధ్యరేఖను దాటి తమ గగనతల రక్షణ జోన్‌లోకి ప్రవేశించాయని తైవాన్ రక్షణశాఖ ఆరోపించింది. ఇటు, చైనా చర్యలపై అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి మైక్ పాంపియో మండిపడ్డారు.‘‘తైవాన్ ఒక స్వతంత్ర, సార్వభౌమ దేశం. ఇది చైనాకు చెందింది కాదు.. దీనికి రుజువు కావాలా?.. ఆ చర్యలకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ బాధ్యత వహించాలని నేను ధైర్యం చేయడంతో నన్ను నిషేధించారు.. అయినప్పటికీ, నేను తైవాన్ గడ్డపై స్వేచ్ఛగా నడిచాను.. అక్కడి ప్రజలు, ప్రభుత్వం నన్ను ఆప్యాయంగా స్వాగతించాయి’’ అని పేర్కొన్నారు.