యావత్తు ప్రపంచంలోనే టైటానిక్ నౌకదే అతి పెద్ద ప్రమాదమని మనం భావిస్తుంటాం. కానీ ఇంచుమించు అలాంటి ప్రమాదమే మన దేశంలోనూ అలాంటి విషాదమే ఇక్కటి జరిగింది. 1947 ఆగస్టు 15... ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు. ఏళ్ల తరబడి తెల్లదొరల పాలనలో మగ్గిన భారతావనికి స్వతంత్రం వచ్చిన రోజు అది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు కూడా జరుపుకుంటున్నాం. అయితే, భారత్ కు సంబంధించి ఓ విషాద ఘట్టానికి కూడా 75 ఏళ్లు పూర్తయ్యాయి. నాడు టైటానిక్ నౌక మునక తరహాలో భారత్ లోనూ ఓ భారీ నౌకా ప్రమాదం జరిగిన సంఘటన చాలామందికి తెలియదు. అందులో 700 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.
అప్పట్లో స్కాట్లాండ్ లో నిర్మితమైన ఎస్ఎస్ రామదాస్ అనే ఓడ ముంబయి-గోవా మధ్య ప్రయాణాలు సాగిస్తుండేది. ఈ నౌక బరువు 406 టన్నులు. 1947 జులై 17న అది ముంబయి-రేవాస్ (అలీబాగ్) మధ్య ప్రయాణించాల్సి ఉంది. ఆ రోజున అసాధారణ రీతిలో నౌక 800 మంది ప్రయాణికులతో క్రిక్కిరిసిపోయింది. రుతుపవనాల సీజన్ కావడంతో, అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో ఎస్ఎస్ రామదాస్ నౌక సజావుగా ప్రయాణించలేకపోయింది. ఈదురుగాలులు, ఎగసిపడే అలల తాకిడికి ప్రమాదానికి గురైంది. కేవలం అరగంట వ్యవధిలోనే వందలాది ప్రయాణికులు సముద్రం పాలయ్యారు.
నౌక ప్రయాణానికి ముందు వాతావరణం నిర్మలంగానే ఉన్నా, కాసేపట్లోనే పరిస్థితి మారిపోయింది. భారీ వర్షం అతలాకుతలం చేసింది. తుపానులో చిక్కుకున్న ఈ నౌక ఊగిపోయింది. ముంబయి తీరానికి 7.5 కిలోమీటర్ల దూరంలో ఎస్ఎస్ రామదాస్ నౌకను ఓ రాకాసి అల ముంచేసింది. రేవాస్ కు ఒకటిన్నర గంటలో చేరాల్సిన ఆ నౌక ఎంతకీ రాకపోవడంతో ఆ నౌక సొంతదారు ఇండియన్ కోఆపరేటివ్ స్టీమ్ నేవిగేషన్ అండ్ ట్రేడిండ్ కంపెనీ తీవ్ర ఆందోళనకు గురైంది.
అప్పట్లో వైర్లెస్ ట్రాన్స్ మీటర్లు లేవు. ఏం జరిగిందో తెలుసుకునే వ్యవస్థలు అందుబాటులో లేవు. అయితే, ముంబయిలోని గేట్ ఆఫ్ ఇండియా తీరానికి చేరువలో ఇండియన్ కోస్ట్ గార్డ్ దళాలకు ఓ బాలుడు సముద్రంలో కనిపించాడు. అతడి పేరు బర్కు ముకద్దమ్. నౌక మునిగిపోతుండడంతో ఇతర ప్రయాణికుల్లాగానే నీటిలోకి దూకేశాడు. అదృష్టవశాత్తు అతడికి ఓ లైఫ్ బాయ్ (ట్యూబు) లభించింది. దాని సాయంతో తేలుతున్న అతడిని కోస్ట్ గార్డ్ దళాలు కాపాడాయి. ఆ బాలుడు చెప్పిన వివరాలతోనే ఎస్ఎస్ రామదాస్ నౌక ప్రమాదానికి గురైన విషయం ఈ లోకానికి తెలిసింది
సహాయక చర్యలు చేపడదామంటే ఓవైపు ఎడతెగని వర్షం! ఈ పరిస్థితి ఇలా కొనసాగుతుండగానే వందల సంఖ్యలో శవాలు తీరానికి కొట్టుకువచ్చాయి. ఈ ప్రమాదం జరిగిన రెండు నెలలకు ఘటనపై విచారణ మొదలైంది. కొందరు నౌకా సిబ్బందిని తొలగించి, చర్యలు తీసుకున్నామనిపించారు. అప్పటినుంచి అన్ని నౌకలపై వైర్లెస్ సమాచార వ్యవస్థలు తప్పనిసరి చేశారు. అంతేకాదు, రుతుపవనాల సీజన్ లో ప్రయాణికుల పడవలు తిరగడంపై నిషేధం విధించారు. అయితే ఈ విషాద ఘటన దేశ చరిత్రలో మరుగునపడిపోయింది. అందుకు కారణం, ఈ ఘటన జరిగిన నెలకే దేశం స్వాతంత్ర్యం అందుకోగా, అనంతరం దేశ విభజన జరిగి మరో ముఖ్య ఘట్టం ఆవిష్కృతమైంది. ఆ నాటి పరిస్థితుల నేపథ్యంలో, ఈ రెండు ఘటనల ముందు ఈ నౌక ప్రమాదం మసకబారింది.