ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం జూరాల ప్రాజెక్టు ద్వారా 2,30,336 క్యూసెక్కులు, విద్యుదోత్పత్తి ద్వారా 27,380 క్యూసెక్కులు, సుంకేశుల ప్రాజెక్టు నుంచి 77,919 క్యూసెక్కుల నీరు విడుదలయ్యాయి. అయితే.. సాయంత్రం కల్లా జలాశయంలో 3,35,635 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోగా నమోదయింది. దీంతో అధికారులు 10 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,75,680 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
ఏపీ పవర్‌హౌస్ నుంచి 30,432 క్యూసెక్కులు, తెలంగాణ పవర్‌హౌస్ నుంచి 31,784 క్యూసెక్కుల నీటితో విద్యుత్ ఉత్పత్తి చేసి ఆ నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.20 అడుగులకు నీరు చేరింది. ప్రాజెక్టు నీటిసామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. ఇప్పుడు 210.99 టీఎంసీల నీటినిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.