నెదర్లాండ్స్, పాకిస్థాన్ మధ్య మంగళవారం జరిగిన తొలి వన్డేలో పాకిస్థాన్ విజయం సాధించింది. పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ ఇమాముల్ హక్ 2 పరుగుల వద్ద అవుట్ కాగా.. పాక్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ బాబర్ అజామ్ (85 బంతుల్లో 74, 6 ఫోర్లు, 1 సిక్స్), ఫఖర్ జమాన్ (109 బంతుల్లో 109 పరుగులు, 12 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఈ క్రమంలో ఫఖర్ వన్డేల్లో ఏడో సెంచరీని అందుకున్నాడు. చివర్లో షాదాబ్ ఖాన్ (28 బంతుల్లో 48 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ధీటుగా ఆడడంతో పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ బీక్, బాస్ చెరో 2 వికెట్లు తీశారు. కింగ్మా ఒక వికెట్ తీశాడు. నెదర్లాండ్స్ వీరోచితంగా పోరాడింది. పాక్ బౌలర్లను డచ్ బ్యాట్స్‌మెన్ సమర్థంగా ఎదుర్కొన్నారు. మన భారత కుర్రాడు విక్రమ్ జిత్ సింగ్ (65 పరుగులు, 98 బంతుల్లో 5 ఫోర్లు) వికెట్ కీపింగ్ చేస్తూ కీలక ఇన్నింగ్స్ ఆడగా.. టామ్ కూపర్ (65 పరుగులు, 54 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (71 పరుగులు, 6 ఫోర్లు) 60 బంతుల్లో 1 సిక్స్ నాటౌట్) వీరోచితంగా పోరాడాడు. ఒక దశలో నెదర్లాండ్స్ విజయం లాంఛనమే అనిపించింది. చివర్లో వికెట్లు కోల్పోయినా.. చివరి మూడు ఓవర్లలో పాక్ బౌలర్లు గట్టి ప్రయత్నం చేయడంతో నెదర్లాండ్స్ 8 వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది. పాకిస్థాన్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది.