కథః కర్నూలుకి చెందిన రవీందర్ రెడ్డి(ఆదిత్య మీనన్), అతని చెల్లెలు భానుమతి(రమ్యకృష్ణ) సీమలో ఫ్యాక్షన్ సంస్కృతికి చరమ గీతం పాడాలనుకుంటారు. అందుకని అక్కడ ప్రజల కోసం మంచి పనులు చేస్తుంటారు. ప్రజల్లో రవీందర్‌రెడ్డికి పెరుగుతున్న పరపతి చూసిన బసిరెడ్డి(రామరాజు) సీమ అభివృద్ధికి అ్డడుపడాలనుకుంటాడు. ఫలితంగా ప్రజల మధ్యలో రవీందర్ రెడ్డి చేతిలో భంగపాటుకు గురవుతాడు. దాంతో ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ కారణంగా బసిరెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి(అజయ్), అతని మనుషులు కలిసి రవీందర్ రెడ్డిని చంపేస్తారు. అన్నను చంపిన కోపంతో భానుమతి ప్రతాప్ రెడ్డి మనుషులను చంపేయిస్తుంటుంది. ప్రతాప్ రెడ్డి పోలీసులకు లొంగిపోతాడు. జైలు నుండే ప్రతాప్ రెడ్డి భానుమతికి ప్రాణమైన మేనకోడలు ఆద్య(రెజీనా)ను చంపడానికి ప్లాన్ వేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న భానమతి, హైదరాబాద్‌లోని తన మేడకోడలు ఆద్యకి బాలు(నారా రోహిత్)ని బాడీగార్డ్‌గా నియమిస్తుంది. తాను బాడీగార్డ్ అని చెప్పకుండా బాలు. ఆద్యకి దగ్గరై ఆమెను కాపాడుతుంటాడు. ఈలోపు సత్ప్రవర్తన క్రింద ప్రతాప్ రెడ్డి జైలు నుండి బయటకొస్తాడు. ఆద్యను బాలు ఎలా కాపాడుకుంటాడు? ప‌్రతాప్ రెడ్డిని బాలు ఎలా ముప్పతిప్పలు పెడతాడు? చివరకి ఎమైందనే విషయం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణః నారా రోహిత్ ఇప్పటి వరకు కొత్త కాన్సెప్ట్ సినిమాలను చేస్తూ రావడంతో, తన సినిమాలంటే కాస్త కొత్తగా ఉంటుందనే అభిప్రాయానికి ప్రేక్షకులు వచ్చారు. ఇలాంటి తరుణంలో రోహిత్ కమర్షియల్ సినిమా చేయాలనుకున్నాడు బాగానే ఉంది. అయితే కమర్షియల్ సినిమాలోనే కొత్ కాన్సెప్ట్ ఉన్న కమర్షియల్ సినిమాను చేసుంటే బావుండేది. ఎప్పటో సినిమాలైన ఢీ, రెఢీ వంటి కాన్సెప్ట్ స్క్రీన్ ప్లేతో ఉన్న కథను ఎంచుకోవడం బిగ్గెస్ట్ మిస్టేక్. ఈ సినిమా ముందు వరకు బాగా లావుగా ఉండే రోహిత్ సిక్స్ ప్యాక్ ట్రై చేశాడు. అంత వరకు బాగానే ఉంది. కానీ సినిమాలో పాటల్లో అక్కడక్కడా సన్నగా కనపడ్డాడు కానీ, సినిమాలో ఎక్కువ భాగం లావుగానే కనపడ్డాడు. ఇక డ్యాన్సులు విషయంలో కూడా రోహిత్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఏవో రెండు స్టెప్పులు నేర్చుకుని ఆ స్టెప్పులనే అటు, ఇటు మార్చి చేస్తూ వచ్చాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ దగ్గర వచ్చే సాంగ్‌లో రోహిత్ కంటే రెజీనా, పియా బాజ్‌పాయ్‌లే కెమెరాలో ఎక్కువ కనపడ్డారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రోహిత్ ఇంట్రడక్షన్ సీన్‌లో హైదరాబాద్ బల్కంపేట కుర్రాడి గెటప్‌లో కనపడ్డప్పుడు ప్రేక్షకులు నవ్వుకుంటారు. పొడవైన జుత్తు వగైరా చూసి రోహిత్‌కి ఇది అవసరమా. మామూలుగా కనపడితే పోతుంది కదా అనుకుంటారు. ఇక ఫైట్స్ విషయంలో కూడా హీరో కదలకుండానే ఫైట్ చేస్తుంటాడు. ఈ మధ్య కుర్రహీరోలే కాదు, సీనియర్ హీరోలు కూడా ఫైట్స్ విషయంలో ఇరగదీస్తుంటే, రోహిత్ మాత్రం నేను కదలకుండానే ఫైట్స్ చేస్తాను..అన్నట్లు తెరపై కనపడ్డాడు. ఇక రెజీనా దాదాపు అందాల అరబోతకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది
సినిమాలో కీలకపాత్ర భానుమతిగా నటించిన రమ్యకృష్ణ పాత్ర ముందు కాసేపు బాగానే ఉన్నా, తర్వాత ఆ పాత్రకు, అందులో రమ్యకృష్ణ నటనకు పెద్ద స్కోప్ కనపడదు. అప్పటి వరకు సింహస్వప్నంలా కనపడ్డ భానుమతి పాత్రను క్లైమాక్స్ ఫైట్‌లో మరి చిన్నబుచ్చేశారు. ఇక మెయిన్ విలన్‌గా నటించిన అజయ్ గురించి చెప్పాలంటే..ఇలాంటి పాత్రలు చేయడం అజయ్‌కి కొత్తకాదనిపించింది. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్, ఆడియెన్ రిలీఫ్‌గా ఫీలయ్యే పాత్ర థర్టీ ఇయర్స్ పృథ్వీ. తనదైన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను నవ్వించాడు. సినిమాను ప్రేక్షకులు థియేటర్‌లో కాస్తో కూస్తో కూర్చొని ఎంజాయ్ చేస్తారంటే కారణం కేవలం పృథ్వీ క్యారెక్టర్. ఇక వెన్నెలకిషోర్, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి తదితరులు వారి పాత్రలకు న్యాయం చేశారు.ఇక దర్శకుడు పవన్ మల్లెల సినిమాను తెరకెక్కించిన తీరు బాలేదు. రొటీన్ కమర్షియల్ కదా..ఇంతకంటే దర్శకుడు ఏం తీస్తాడులే అనుకోవచ్చును కూడా. మణిశర్మ పాటలు వినసొంపుగా లేవు, నేపథ్య సంగీతం బాలేదు. విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ బానే ఉంది. హీరోలందరూ కాన్సెప్ట్ సినిమాలంటూ పరుగులు తీస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న తరుణంలో నారా రోహిత్ ఎందుకనో కమర్షియల్ సినిమా చేయాలనుకున్నాడు. చేస్తే చేశాడు కానీ, పాత చింతకాయ పచ్చడి..బోరింగ్ కథ, స్క్రీన్‌ప్లేతో సాగే సినిమాను చేయాలనుకోవడం ఎంత వరకు కరెక్ట్ అనేది తెలియడం లేదు. లేదు..నేను ఇలాంటి కమర్షియల్ సినిమాలే చూస్తాను అనుకునే ప్రేక్షకులు ఉంటే వారిని ఆపతరం కాదు మరి..
రివ్యూ : 2.5/5
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa