ఓటీటీలో ఇప్పుడు థ్రిల్లర్ జోనర్ మకుటం లేని మహారాజుగా వెలుగొందుతోంది. ప్రతివారం క్రైమ్ థ్రిల్లర్లు .. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లు .. సస్పెన్స్ థ్రిల్లర్లు రంగంలోకి దిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే 'దల్దాల్' అనే సైకలాజికల్ థ్రిల్లర్ గా ఓ హిందీ వెబ్ సిరీస్ బరిలోకి దిగింది. హిందీతో పాటు ఇతర భాషల్లోను ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. జనవరి 30వ తేదీ నుంచి 7 ఎపిసోడ్స్ గా స్ట్రీమింగ్ అవుతోంది. భూమి పెడ్నేకర్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. ముంబైలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. చేతి మణికట్టు కోసి ..అందుబాటులో ఉన్న వస్తువులను నోట్లో కుక్కేసి అత్యంత దారుణంగా హత్య చేస్తుంటారు. డీసీపీ రీటా ఫెరీరా ( భూమి పెడ్నేకర్)కి ఈ కేసుకు అప్పగించడం జరుగుతుంది. ఆమెకి సహాయకారిగా మరో ఆఫీసర్ ఇందు మాత్రే (గీతా అగర్వాల్) ఉంటుంది. జరిగిన హత్యలు.. వాటి తీరుతెన్నులను రీటా పరిశీలిస్తుంది. సమాజానికి తమవంతు సాయం చేస్తున్నవారినే హత్య చేస్తున్నారనే విషయం ఆమెకి అర్థమవుతుంది. పేదలకు అన్నదానం .. పేద విద్యార్థులకు ఆర్ధిక సాయం .. మూగ జీవాల పట్ల కారుణ్యం చూపడం వంటివి చేస్తున్నవారే హత్యకి గురవుతూ ఉండటం, రీటాకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మీడియా అంతా కూడా హత్య కేసులపైనే ఎక్కవగా ఫోకస్ చేస్తూ ఉంటుంది. ఒక వైపున ఆగని హత్యలు .. మరో వైపున శరణాలయాల నుంచి ఆడలిల్లల తరలింపు .. మాదక ద్రవ్యాల రవాణా రీటాకి సవాళ్లు విసురుతూ ఉంటాయి. బాల్యం చేసిన గాయాల నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తూనే, ఆమె తన డ్యూటీని కొనసాగిస్తూ ఉంటుంది. హత్య కేసుల విషయంలో పోలీసుల వైఖరి పట్ల జర్నలిస్ట్ అనిత (సమర తిజోరి) తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఆమె దూకుడికి పోలీసులు సైతం కంగారుపడుతూ ఉంటారు. అయితే బయట ప్రపంచానికి జర్నలిస్ట్ అనితగా కనిపిస్తున్న ఆమె, తన స్నేహితుడైన సాజీద్ (ఆదిత్య రావల్)తో కలిసి హత్యలు చేస్తూ ఉంటుంది. అందుకు కారణం ఏమిటి? సాజీద్ ఎవరు? ఈ ఇద్దరి హంతకులను పట్టుకునే విషయంలో ఏసీపీ రీటాకి ఎదురయ్యే సవాళ్లు ఎలాంటివి? అనేది కథ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa