ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూవీ రివ్యూ : సాఫ్ట్ వేర్ సుధీర్

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 28, 2019, 02:09 PM

జబర్దస్త్ వంటి ప్రముఖ కామెడీ షో ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం సాఫ్ట్ వేర్ సుధీర్. ధన్యా బాలకృష్ణ హీరోయిన్ గా నటించగా దర్శకుడు రాజశేఖర్ రెడ్డి క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. కాగా నేడు ఈ చిత్రం విడుదల కావడం జరిగింది.


కథ: చందు (సుడిగాలి సుధీర్) అమాయకుడైన మంచి లక్షణాలు కలిగిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి. తన ఆఫీస్ లో పనిచేసే స్వాతి (ధాన్యా బాలకృష్ణ) ప్రేమలో పడిన చందు ఆమె ప్రేమను గెలుచుకుంటాడు. ఒకరినొకరు ఇష్టపడిన చందు స్వాతి ఎంగేజ్మెంట్ జరిగిన అనంతరం వారి కుటుంబాలలో కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. సెంటిమెంట్స్ ని ఎక్కువగా ఫాలో అయ్యే స్వాతి సలహా మేరకు ఓ స్వామిజీని వీరు కలవడం జరుగుతుంది. ఐతే ఆ స్వామిజీ చందుని పావుగా వాడుకొని సుధీర్ తండ్రి (సాయాజీ షిండే) పనిచేసే మంత్రి (శివ ప్రసాద్) దగ్గర నుండి వెయ్యి కోట్లు కొట్టివేస్తారు.దీంతో మంత్రి నా డబ్బులు నాకు తిరిగి అప్పగించకపోతే చందుని చంపేస్తాను అని బెదిరిస్తాడు. మరి చందు ఆ వెయ్యి కోట్లు తిరిగి సంపాదించాడా? ఆ స్వామీజీని కనిపెట్టడా? అసలు స్వామిజీ గా నటించిన వారు ఎవరు? వాళ్ళు మంత్రి దగ్గర ఎందుకు డబ్బులు కొట్టివేశారు? అనేది తెరపైన చూడాలి.


ప్లస్ పాయింట్స్: జబర్దస్త్ వంటి పాపులర్ కామెడీ షోలో నవ్వులకు కేరాఫ్ అడ్రెస్ అయిన సుడిగాలి సుధీర్ హీరోగా తెరపై తన ఎనర్జీతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా డాన్స్ లలో ఆయన మాస్ హీరో రేంజ్ లో ఇరగదీశాడు. అమాయకుడైన సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా సుధీర్ నటన పాత్రకు తగ్గట్టుగా ఉంది. అక్కడక్కడా ఆయన కామెడీ టైమింగ్ కూడా బాగుంది. హీరోయిన్ ధన్యా బాలకృష్ణ రెండు భిన్న షేడ్స్ కలిగిన పాత్రను చక్కగా పోషించింది. పాటలలో ఆమె గ్లామర్ యూత్ కి కిక్కెక్కించేదిలా ఉంది. అలాగే పతాక సన్నివేశాలలో కూడా ఆమె చక్కగా నటించారు. సెకండ్ హాఫ్ లో కథలో వచ్చే రెండు ట్విస్ట్స్ బాగున్నాయి. ఇక భీమ్స్ అందించిన సాంగ్స్ చాలా బాగున్నాయి. హీరో తల్లి దండ్రులుగా చేసిన సాయాజీ షిండే, ఇంద్రజ తమ పరిధిలో చక్కగా నటించారు. మంత్రి పాత్రలో శివ ప్రసాద్, హీరో మావయ్యగా పోసాని నటన ఆకట్టుకుంటుంది.


మైనస్ పాయింట్స్ : కొంచెం ఆసక్తిగా మొదలైన సాఫ్ట్ వేర్ సుధీర్ సెకండ్ హాఫ్ తరువాత కొంచెం ట్రాక్ తప్పుతుంది. ఓ సోసియో ఫాంటసీ కథ చూస్తున్నాం అని ఫీలైన ప్రేక్షకుడికి విరామం తరువాత ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ అని అర్థం అవుతుంది. దీనితో ఆడియన్స్ కథనుండి డైవర్ట్ అయిపోతారు. కామెడీ కోసం రైమింగ్ తో కూడిన పంచ్ లు రాసుకున్నప్పటికీ అవి తెరపై పేలలేదు. సుడిగాలి సుధీర్ మూవీ అంటే మంచి కామెడీ ఉంటుందని ఆశించే ప్రేక్షకులకు ఇది నిరాశ కలిగించే అంశం. ఆసక్తిగా మలచగలిగే అంశాన్ని కథగా ఎచుకున్నప్పటికీ దానికి సరైన స్క్రీన్ ప్లే లేకపోవడం వలన అనాసక్తిగా సాగింది. సన్నివేశాల మధ్య ఫ్లో లేకపోవడం కూడా ఒక మైనస్ అని చెప్పవచ్చు.


సాంకేతిక విభాగం: సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాలో అన్నింటికీ మించి ఆకట్టుకొనే అంశం సాంగ్స్. భీమ్స్ అందించిన సాంగ్స్ చాల బాగున్నాయి. ఐతే బి జి ఎం విషయంలో ఆయన నిరాశ పరిచారు. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ పరవాలేదు. ఎడిటింగ్ కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. ఇక దర్శకుడు రాజశేఖర్ రెడ్డి ఎంచు కున్న కథను ఆకట్టుకొనేలా తీయడంలో విఫలం చెందాడు. మంచి స్టార్ కాస్ట్ ని తీసుకున్న ఆయన ఏ ఒక్క నటుడిని పూర్తి స్థాయిలో వాడుకోలేదు. ఆయన స్క్రీన్ ప్లే తికమకగా నిరాశాజనకంగా సాగింది. ప్రతి సన్నివేశంలో అనుభవ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. సన్నివేశాల చిత్రీకరణ వాటి ముగింపు విషయంలో ఆయన కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సింది. చాలా సన్నివేశాలలో దర్శకుడు లాజిక్ ఫాలో కాలేదు.


తీర్పు: మొత్తంగా చెప్పాలంటే సాఫ్ట్ వేర్ సుధీర్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఒక ఫ్లో మరియు లాజిక్ లేని సన్నివేశాలు ప్రేక్షకుడిని నిరాశకు గురిచేస్తాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో మూవీ గందర గోళానికి గురిచేస్తుంది. ఒక సోసియో ఫాంటసీ చిత్రం చూస్తున్నాం అని ఫీలైన ప్రేక్షకుడికి విరామం తరువాత దర్శకుడు ఓ క్రైమ్ స్టోరీని పరిచయం చేశాడు. ఐతే సుడిగాలి సుధీర్ కామెడీ టైమింగ్ అలాగే అతని ఎనర్జిటిక్ డాన్సులు అలరిస్తాయి. ధన్యా బాలకృష్ణ గ్లామర్ కూడా ఈ మూవీలో ప్రేక్షకుడికి కొంచెం ఉపశమనం కలిగించే అంశం.


నటీనటులు :  సుడిగాలి సుధీర్, ధన్యా బాలకృష్ణ, ఇంద్రజ, పోసాని, నాజర్, షాయాజీ షిండే, పృథ్వి, శివ ప్రసాద్, గద్దర్ తదితరులు..


దర్శకత్వం : పి. రాజశేఖర్ రెడ్డి


నిర్మాత‌లు : శేఖర్ రాజు


సంగీతం :  భీమ్స్


సినిమాటోగ్రఫర్ : సి. రామ్ ప్రసాద్


రేటింగ్ : 2.5/5. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa