ఆయన సినిమాలు కాలేజీ రోజులను గుర్తుచేస్తుంటాయి. ఆయన సినిమాలు ఒకే వీధిలో వుండే స్నేహాన్ని గుర్తుచేస్తుంటాయి. ఆయన సినిమాలు ఎందరినో 'ఫిదా' చేస్తుంటాయి. తెర వెనుక ఎక్కువ పనిచేసి తెర ముందు తక్కువ కనపడే మోస్ట్ టాలెంటడ్ డైరెక్టర్ 'శేఖర్ కమ్ముల'. ఆయన జన్మదినం సందర్భంగా శేఖర్ కమ్ముల సినిమాలపై ప్రత్యేక కథనం. శేఖర్ కమ్ముల సినిమాలలో ఎలాంటి అస్లీలత, హింస కనిపించవు. మనసుకు హత్తుకుపోయే పాత్రలతో ఆయన సినిమాలు ముడిపడి ఉంటాయి. ఆయన తీసిన గోదావరి, హ్యాపీడేస్, లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలే అందుకు ఉదాహరణలు. శేఖర్ కమ్ములకు మొదటి నుంచి సినిమాలంటే పిచ్చి. సినిమాలపై వున్న ఇష్టంతోనే 2000 సంవత్సరంలో 'డాలర్ డ్రీమ్స్' అనే సినిమా తీశారు. ఆ సినిమా తీసేటప్పుడు ఆయన పడ్డ తపన, తపస్సు అంతా ఇంతా కాదు. ఒకేసారి సినిమాని పూర్తి చేసే స్థాయిలో చేతుల్లో అంత సొమ్ము లేదు. కానీ, సినిమా తీయాలనే సంకల్పం మెండుగా ఉంది. ఆ సంకల్పమే ఏ మాత్రం చెదిరిపోకుండా నెమ్మది నెమ్మదిగా డబ్బులు సమకూర్చుకుంటూ తీసిన సినిమా డాలర్ డ్రీమ్స్. ఈ సినిమాతో బెస్ట్ ఫస్ట్ ఫిలిం డైరెక్టర్ గా జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు. డాలర్ డ్రీమ్స్ తో విమానం రెక్కలు పట్టుకుని విదేశాలకు మేధో వలస వెళ్తున్న భారతీయుల్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన సినిమా. అవార్డులు, పురస్కారాలు అందుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలను సైతం అనుడుకున్న సినిమా ఇది. డాలర్ డ్రీమ్ సినిమా విజయంతో ఒక్కో మెట్టు ఎక్కుతూ చక్కటి 'గోదావరి' లాంటి చిత్రాలతో ప్రేక్షకులను 'ఫిదా' చేస్తూ 'హ్యాపీడేస్' ని పంచుతూ వచ్చారు శేఖర్ కమ్ముల. అందుకే ఆయనకు ఎన్నో అవార్డులు వచ్చాయి. 2004లో ఆనంద్ సినిమాకి గాను ఉత్తమ దర్శకుడిగా, ద్వితీయ ఉత్తమ సినిమాగా రెండు నంది అవార్డులు అందుకున్నారు. 2006లో గోదావరి సినిమాకి ఉత్తమ దర్శకుడిగా, ద్వితీయ ఉత్తమ సినిమాగా రెండు నంది అవార్డులు అందుకున్నారు. 2007లో హ్యాపీ డేస్ సినిమాకి ఉత్తమ సినిమాగా నంది అవార్డు అందుకున్నారు. 2011లో లీడర్ సినిమాకి ఉత్తమ కథకుడిగా నంది అవార్డు అందుకున్నారు. 2007లో హ్యాపీ డేస్ సినిమాకి ఉత్తమ సినిమాగా , ఉత్తమ దర్శకుడిగా రెండు ఫిలిం ఫేర్ పురస్కారాలు అందుకున్నారు. హ్యాపీ డేస్ సినిమాకి దాసరి బెస్ట్ ఫిలిం డైరెక్టర్ అవార్డు అందుకున్నారు. ఫిదా సినిమాకి జీ గోల్డెన్ అవార్డుని స్వీకరించారు. మీరు ఇలాగే తెలుగు ప్రజలకు 'హ్యాపీడేస్' ని పంచుతూ అందరిని 'ఫిదా' చేయాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు శేఖర్ కమ్ముల.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa