తాడిని తన్నేవాడు ఒకడుంటే.. వాడి తలను తన్నేవాడు మరొకడు ఉంటాడంటారు కదా.. ఇప్పుడు ఆర్జీవీ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. అందరి బయోపిక్స్ తీసి ఈయన చూపిస్తుంటాడు. అలాంటిది ఇప్పుడు ఈయన బయోపిక్‌కే ఏర్పాట్లు జరుగుతున్నాయి. వర్మ బయోపిక్ అంటేనే అదో స్పెషల్. తెలుగు సినిమాల్లో కాదు.. దేశవ్యాప్తంగా కూడా సంచలనాలకు కేంద్రబిందువు ఎవరైనా ఉన్నారా అంటే అది మరో అనుమానం లేకుండా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. సంచలనాలు వస్తే ఓకే.. లేదంటే ఈయనే వెతుక్కుంటూ అక్కడికి వెళ్తుంటాడు. అదే మనోడి స్టైల్.
30 ఏళ్లుగా ఇండియన్ సినిమాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని దూసుకుపోతున్నాడు వర్మ. గతేడాది కూడా అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అంటూ వచ్చాడు. అలాంటిదిప్పుడు వర్మ బయోపిక్ వస్తుంది. ఈ మధ్య రైటర్ జొన్నవిత్తులతో వర్మకు పెద్ద గొడవే అయింది. మెగా ఫ్యామిలీ సినిమా విషయంలో ఈయనతో మాట మాట పెంచుకున్నాడు వర్మ. ఇక ఇప్పుడు ఈయనే వర్మ బయోపిక్ తెరకెక్కిస్తున్నాడు జొన్నవిత్తుల. ఆయనే దర్శకుడు నిర్మాత కూడా. ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసాడు ఈయన. RGv.. రోజూ గిల్లే వాడు అంటూ దీనికి టైటిల్ కూడా కన్ఫర్మ్ చేసాడు. ఈ సినిమాలో వర్మగా అచ్చంగా ఆయనలా ఉండే వ్యక్తిని పట్టుకున్నాడని తెలుస్తుంది.
వర్మకు దేశంలో చాలా క్రేజ్ ఉంది. అందుకే తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కూడా వర్మ బయోపిక్ విడుదల చేస్తున్నాడు జొన్నవిత్తుల. 'తా చెడ్డకోతి వనమెల్లా చెరిచినట్లు' తన పిచ్చి ఇజంతో యువతను పెడత్రోవ పట్టిస్తున్న ఒక వ్యక్తి ఫిలాసోఫి మీద సంధించిన రామబాణమే ఈ సినిమా అని.. అందుకే శ్రీరామనవమి పర్వదినాన ఈ చిత్ర టైటిల్ లోగో విడుదల చెయ్యడం జరిగిందని తెలిపాడు జొన్నవిత్తుల. చిత్ర సమర్పకులు వెంకట శ్రీనివాస్ బొగ్గరం మాట్లాడుతూ.. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన వెంటనే చిత్రీకరణ ప్రారంభిస్తామని.. సామాజిక బాధ్యత లేని ఒక కుహనా మేధావి ఐడియాలజీ సమాజాన్ని ఎలా కలుషితం చేస్తుందో తెలిపేదే ఈ సినిమా అని చెప్పారు. మొత్తానికి వర్మ బయోపిక్ ఎలా ఉండబోతుందో చూడాలిక.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa