తెలుగు తెరకు శ్రుతిమించని హాస్యంతో చక్కలిగిలి పెట్టి, ప్రేక్షకుల హృదయాలలో గిలిగింతలు రేపిన ‘హాస్యబ్రహ్మ’ జంధ్యాల! ‘‘మాటలు రాయడమంటే మాటలు కాదు’’ అని నమ్మి, హాస్యానికీ... అపహాస్యానికి మధ్య ఉన్న సున్నితమైన రేఖను గమనించి సంభాషణాశ్రయ హాస్యాన్ని సృష్టించడంలో పేరుపొందిన పదహారణాల తెలుగు రచయిత, దర్శకుడు జంధ్యాల. నేడు ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు మీకోసం.జంధ్యాల 1951 జనవరి 14 న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించాడు. బి.కామ్ వరకు చదువుకున్నారు. చిన్నతనం నుండి నాటకాల పట్ల ఆసక్తిగా ఉండడంతో అయన స్వయంగా నాటకాలు రచించాడు. అలా ఆయన రాసిన నాటకాల్లో ఏక్ దిన్ కా సుల్తాన్, గుండెలు మార్చబడును ప్రముఖమైనవి. ఆయన నాటకాలకి గాను అనేక బహుమతులు అందుకున్నారు. జంధ్యాల పూర్తి పేరు జంధ్యాల వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి. హాస్యానికి పెద్ద పీట వేస్తూనే, సందర్భోచితంగా మాటలు రాసి మెప్పించడం, వైవిధ్యమైన పాత్రల్ని సృష్టించడం జంధ్యాలకు నవ్వుతో అబ్బిన విద్య. 1976 నుంచి 2000 సంవత్సరం వరకూ తెలుగు చలనచిత్రసీమలో జంధ్యాల పూయించిన మాటలు, హాస్య ప్రియుల మనసుల్లో ఇప్పటికీ పరిమళాలు వెదజల్లుతూనే ఉంటాయి. చలనచిత్ర రచయితగా రంగ ప్రవేశం చేయక ముందు ‘‘ఏక్ దిన్ కా సుల్తాన్’’, ‘‘గుండెలు మార్చబడను’’ వంటి హాస్యనాటక రచయితగా ప్రసిద్ధుడైన జంధ్యాల, హాస్య సంభాషణాచతురుడు. ఒక సభలో బాలు, ఎస్.జానకి, శైలజ ప్రసంగించి శ్రోతల కళ్ల వెంట నీరు తెప్పిస్తే ఆ సభలోనే అతిథిగా పాల్గొన్న జంధ్యాల, వారి తర్వాత మాట్లాడుతూ ‘‘ఇంత వరకు ‘పాడు’ మనుషులు ముగ్గురొచ్చి కంట తడి పెట్టించారని’’ ప్రసంగం ప్రారంభించగానే సభలో నవ్వులు మార్మోగాయిట. అదీ జంధ్యాల సమయ స్ఫూర్తి. ఎన్నో ఎన్నెన్నో హస్యప్రధానమైన చిత్రాలను అందించిన జంధ్యాల నవ్వు గురించి ఓ మాట అంటుండేవారు " నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం" మని అందరితో చెబుతూ ఉండేవారు. ఆయన 2001 జూన్ 19న గుండె పోటుతో మరణించారు. హస్యబ్రహ్మాగ తెలుగు ప్రేక్షకులలో చెరగని ముద్ర వేశారు జంధ్యాల.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa