తారాగణం: రామ్‌గోపాల్ వర్మ, కత్తి మహేశ్ మినహా మిగతా వాళ్లంతా మనకు తెలీనివాళ్లే
విడుదల తేదీ: 25 జూలై 2020
ప్లాట్‌ఫామ్: ఆర్జీవీ వరల్డ్ థియేటర్
రామ్‌గోపాల్ వర్మ 'పవర్ స్టార్' మూవీని అనౌన్స్ చేసినప్పుడు, ఒకదాని తర్వాత ఒకటిగా ఆ సినిమాలోని స్టిల్స్‌ను, అందులోని పాత్రధారుల్నీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పరిచయం చేసినప్పుడు పవన్ కల్యాణ్ తప్ప ఆయన ఫ్యాన్స్ అంతా గోల చేయడం మొదలుపెట్టారు. మొన్న రిలీజ్ చేసిన 4 నిమిషాల ట్రైలర్ తర్వాత ఆ గోల మరింత ఎక్కువైంది. పవన్ కల్యాణ్‌ను ఏ రీతిన ఆర్జీవీ టార్గెట్ చేశాడో ఆ ట్రైలర్ ద్వారా మనకు అర్థమైంది. మరి 'పవర్ స్టార్' మూవీ మొత్తంగా ఎలా ఉంది? నిజానికి ఇది ఫీచర్ లెంగ్త్ ఫిల్మ్ కాదు. కేవలం 37 నిమిషాల షార్ట్ ఫిల్మ్. లాక్‌డౌన్ పీరియడ్ స్టార్ట్ అయ్యాక ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో రిలీజ్ చేసిన మూడో షార్ట్ ఫిల్మ్ ఇది.
కథ:
'పవర్ స్టార్'లో కథ లేదు. ఇది కొన్ని సన్నివేశాల కలయిక మాత్రమే. 2019లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగి, వాటి ఫలితాలు వచ్చాక మనసేన అనే పార్టీ నాయకుడి పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ప్రయత్నించిన ఫిల్మ్ ఇది. ఫలితాలు వచ్చిన రాత్రి పార్టీ ఒకే ఒక్క సీటు గెలుచుకున్నందుకు, తన పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయినందుకు ఆవేదన చెందే సన్నివేశంతో మొదలై, ప్రవణ్ కల్యాణ్‌కు తాను అభిమానినంటూ రామ్‌గోపాల్ వర్మ వచ్చి, ఆయన మీద తన అభిమానాన్ని చాటుకుంటూ, తత్వం బోధించే సన్నివేశంతో ముగిసే సినిమా ఇది. అందువల్ల ఈ సినిమాలో కథంటూ ఏమీ లేదు.
విశ్లేషణ:
కేవలం పవర్ స్టార్ ఇమేజ్‌ను, క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి ఆర్జీవీ తీసిన ఫిల్మ్ ఇదని ఈజీగా చెప్పేయవచ్చు. సినిమా మొత్తమ్మీద అతి పెద్ద సీన్ ఏదైనా ఉందంటే అది ఆర్జీవీ తనపై తీసుకున్న లాస్ట్ సీనే. 37 నిమిషాల సినిమాలో పది నిమిషాల పైత్యం సీను తనపైనే పెట్టుకున్నాడు వర్మ. ఈ మధ్యలో కొన్ని పాత్రలు వస్తాయి. తాము అడగాలనుకున్నవీ, చెప్పాలనుకున్నవీ చెప్పేసి వెళ్తాయి.
ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నైట్ సీన్ తర్వాత తనకు అత్యంత సన్నిహితుడైన డైరెక్టర్ చెంప చెళ్లుమనిపిస్తాడు ప్రవన్ కల్యాణ్. ఆ డైరెక్టర్ ఆయనతో 'జిజ్ఞాతవాసి' అనే సినిమా తీసి ఉంటాడు. ఎలక్షన్లలో ఆ డైరెక్టర్ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివాననీ, అది జనానికి నచ్చలేదనీ, అందుకే వాళ్లు ఓట్లేయలేదనీ డైరెక్టర్‌ని తిట్టిపోస్తాడు ప్రవన్. అయినా సరే ఆ డైరెక్టర్ ఫీలవకుండా ప్రవన్‌ను ఓదార్చడమే కాకుండా, తన మాటల మాయతో ఆయనను ఆకాశానికెత్తేస్తాడు.
పవర్ స్టార్ ఇంటికి ఆయనకంటే ముందు స్టార్ అయిన పెద్దన్నయ్య వస్తాడు. నీకంటే ముందు స్టార్‌ని అయ్యాననీ, నీకంటే ముందు రాజకీయాల్లోకి వచ్చాననీ, నీకంటే ముందు ఓడిపోయాననీ అంటాడు. "నువ్వు పార్టీ పెడితే నన్ను తిడతన్నారేంట్రా" అని ఆవేదన పడతాడు. సినిమా ఫంక్షన్లలో ఒకలా, ఎన్నికల సభల్లో ఇంకోలా మాట్లాడతావేంటని తమ్ముడిని నిలదీస్తాడు. "నువ్వు పవర్ స్టార్ అయ్యింది.. కానిస్టేబుల్ కొడుకుగానా, నా తమ్ముడిగానా?" అని ప్రశ్నిస్తాడు.
తర్వాతి సీన్‌లో ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ వస్తాడు. తన నిజ జీవిత పాత్రలోనే ఆయన కనిపిస్తాడు. అతను ఇంటర్వ్యూ చేసే సమయంలోనూ పూణే నుంచి ఫోన్ వచ్చిందనంగానే ఇంటర్వ్యూ మధ్యలో వదిలేసి వెళ్లిపోతాడు.
ఇక ఫామ్‌హౌస్‌లో పవర్ స్టార్ తను చేసే పనులను పాట రూపంలో చెప్పుకొస్తాడు. గేదెలకు గడ్డి పెడతాడు. తనను అందరూ ముంచేశారని వాపోతాడు. పులి లాంటోణ్ణి పిల్లి చేసేశారుగా అని బాధపడతాడు. గేదెలు, ఆవుల కంటే తనకు దోస్తులెవరూ లేరని అంటాడు.
పాటయ్యాక ఇంట్లో సోఫాలో కూర్చొని హెన్నీ షారియర్ 'పాపిలాన్' బుక్ చదువుకుంటుంటే రష్యన్ వైఫ్ టీ తీసుకొచ్చి ఇస్తుంది. అది తాగుతూ, పుస్తకం చదువుతుంటే బాడీగార్డ్ వచ్చి పూణే నుంచి కాల్ అంటూ ఫోన్ ఇవ్వబోతాడు. రష్యన్ భార్య ప్రవన్‌పై కోప్పడితే, ఫోన్ చేసింది నేను కాదుగా అని విసుక్కుంటాడు.
పవర్ స్టార్ ఫామ్‌హౌస్‌లో చెట్ల మధ్య నడుస్తుండగా ప్రొడ్యూసర్ గుండ్ల రమేశ్ వచ్చి పొగడ్తలతో ముంచెత్తుతాడు. ఆయనపై బయోపిక్ తీయాలనుకుంటున్నాననీ, అందులో రామ్‌గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో చేసిన నటుడితో ఆ బయోపిక్ చేద్దామనుకుంటున్నాననీ చెప్తాడు. దాంతో ఆవేశం పట్టలేక చేతిలోని పుల్లతో ప్రొడ్యూసర్‌ను బాదుతాడు పవర్ స్టార్. గుండ్ల రమేశ్ లబోదిబోమంటూ పారిపోతాడు.
చిన్నన్న ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేస్తాడు. ఓటింగ్‌లో అవకతవతకలు జరిగాయి కాబట్టే ఎన్నికల్లో ఓడిపోయామని చెబుతాడు. ఉద్యమం చేద్దామనీ, రీకౌంటింగ్‌కు డిమాండ్ చేద్దామనీ అంటాడు. అన్నను వారిస్తాడు ప్రవన్. రీకౌటింగ్ అని కెలికితే, ఉన్న ఒక్క సీటూ ఊడుద్దేమోనంటాడు.
ఈసారి ప్రవన్ ఇంటికి బాబు వస్తాడు. తన కొడుకు ఓడిపోయినదానికన్నా ప్రవన్ పోటీ చేసిన రెండు సీట్లలోనూ ఓడిపోయినందుకు మరింత బాధగా ఉందంటాడు బాబు. ఇద్దరి మధ్యా వాదోపవాదాలు జరిగి, బాబును అక్కణ్ణించి వెళ్లగొట్టేస్తాడు ప్రవన్.
చీకట్లో రివాల్వింగ్ చైర్‌లో కూర్చొని అప్పటిదాకా తనను కలిసిన వాళ్లు చెప్పిన మాటల్ని మననం చేసుకుంటూ ఉంటాడు ప్రవన్. తను రాజకీయాల్లో ఉండాలా, వద్దా అని మల్లగుల్లాలు పడుతుంటే రామ్‌గోపాల్ వర్మ ఓడ్కా బాటిల్‌తో ఎంటరవుతాడు. ప్రవన్ కల్యాణ్ అంటే తనకు విపరీతమైన అభిమానమంటూ లెక్చర్ దంచుతాడు. ప్రవన్ నటించిన సినిమాలు, పాత్రలు పాత్ బ్రేకింగ్ అని మెచ్చుకుంటాడు. అయితే 'గాజు తేజ'తో కలిసి ప్రవన్ రాసిన ఇజం పుస్తకాన్ని విమర్శిస్తాడు. గాజు తేజగాడు మిమ్మల్మి మోసం చేశాడంటాడు. అయాన్ ర్యాండ్, ఇమ్మాన్యుయేల్ కాంట్ వంటి ఇంటర్నేషనల్ రైటర్స్ రాసిన పుస్తకాలను ఏకరువు పెడతాడు. 2024 ఎన్నికల్లో గెలిచి సీఎం అవుతారని గ్లాస్ పగలగొట్టి మరీ జోస్యం చెబుతాడు. అప్పుడు అందరికంటే ముందు జై పవర్ స్టార్ అంటానని వర్మ అంటాడు. దాంతో వర్మను గట్టిగా కౌగలించుకుంటాడు ప్రవన్. అంతే.. పవర్ స్టార్ సినిమా సమాప్తం.
తారాగణం పనితీరు:
ఈ సినిమాలో నటీనటుల పేర్లు కానీ, టెక్నీషియన్ల పేర్లు కానీ ఆర్జీవీ ఇవ్వలేదు. నటీనటులందరిలోకీ జీవించింది రామ్‌గోపాల్ వర్మే. పేరుకు పవర్ స్టార్ అని పెట్టాడు కానీ క్లైమాక్స్‌లో కుమ్మేసింది ఆర్జీవే. చివర పది నిమిషాల పాటు పవర్‌లెస్ స్టార్‌గా మారిపోయి ఆర్జీవీ చెప్పే తత్వాన్ని ఒక్క మాటా మాట్లాడకుండా వింటూ కూర్చొని చివరలో వర్మను వాటేసుకోవడమే ప్రవన్ చేసే పని. 'పవర్ స్టార్' టైటిల్ రోల్‌లో నటించిన యువకుడు పవన్ కల్యాణ్ మేనరిజమ్స్‌ను బాగానే ప్రదర్శించాడు కానీ, అప్పీరెన్స్ పరంగా ఆయన కరిష్మాలో కాస్తంత కూడా చూపించలేకపోయాడు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
'పవర్ స్టార్'ను చూశాక దీన్ని సినిమా అంటారా? సినిమాని ఇలా కూడా తీసి, కాంట్రవర్సీ పబ్లిసిటీతో సొమ్ము చేసుకోవాలని జనం మీదకు వదిలేస్తారా? అనిపించక మానదు. ఆర్జీవీలోని డైరెక్టర్ ఏనాడో భూస్థాపితమైపోయాడని మరోసారి రుజువు చేసే చిత్రం పవర్ స్టార్. ఈ సినిమాపై మనం పెట్టే డబ్బు పూర్తిగా వృథా అనేది నా అభిప్రాయం.
రేటింగ్ :1/5
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa