దాదాపు యాభై ఏళ్ల పాటు భారత సినీ లోకాన్ని ఉర్రూతలూగించి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది విఖ్యాత నటి శ్రీదేవి. ఆ అతిలోక సుందరి హఠాత్తుగా చనిపోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక, ఆమె కూతుళ్లు జాన్వి, ఖుషీల పరిస్థితిని ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఈ రోజు (శనివారం) శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి పుట్టినరోజు. 21వ జన్మదినోత్సవ సందర్భంగా తన తల్లిని, ఆమెతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ జాన్వీ ఓ భావోద్వేగ లేఖను రాసింది.
`ఇప్పుడు నా హృదయానికి తగిలిన గాయంతో బతకడం ఎలాగో నేర్చుకోవాలి. నా చుట్టూ ఇంత శూన్యత ఆవరించి ఉన్నా.. ఇంకా నీ ప్రేమను అనుభూతి చెందుతున్నాను. బాధ నుంచి, విచారం నుంచి నన్ను నువ్వు రక్షిస్తున్నట్టు ఫీలవుతున్నాను. కళ్లు మూసుకుంటే నాకన్నీ మంచి విషయాలే గుర్తుకొస్తున్నాయి. దానికి కారణం నువ్వే అని తెలుసు. సాధ్యమైనంత కాలం మా జీవితాల్లో నువ్వు ఉండడం మేం చేసుకున్న అదృష్టం.
నువ్వు చాలా మంచిదానివి. చాలా స్వచ్ఛమైనదానివి. అందుకే నిన్ను దేవుడు త్వరగా తీసుకెళ్లిపోయాడు. నేను ఎప్పుడూ ఆనందంగానే ఉంటానని నా స్నేహితులు అంటూ ఉంటారు. దానికి కారణం నువ్వేనని నాకిప్పుడు అర్థమవుతోంది. నన్ను ఎవరు ఏమన్నా పట్టించుకోలేదు. ఏదీ పెద్ద సమస్యగా అనిపించలేదు. ఏ రోజూ నిస్తేజంగా లేదు. ఎందుకంటే అప్పుడు నువ్వు నాతో ఉన్నావు. నేను ఎప్పుడూ ఎవరి మీదా ఆధారపడలేదు. ఎందుకంటే నాకు కావాల్సిన ఒకేఒక వ్యక్తివి నువ్వు.
నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి. నా ఆత్మలో భాగం. మా కోసం నీ జీవితాన్ని అర్పించావు. ఇప్పుడు నీ కోసం నేనూ ఆ పని చేస్తా. నువ్వు గర్వపడేలా చేస్తా. ప్రతీ ఉదయం అదే ప్రతిజ్ఞతో నిద్ర లేస్తా. నువ్వు నాలో, ఖుషీలో, నాన్నలో నిండి ఉన్నావు. మాపై నీ ప్రభావం చాలా బలమైనది. మేం బతకడానికి అది చాలు.. కానీ, నీవు లేని లోటుని పూరించడానికి మాత్రం చాలదు.. ఐ లవ్యూ` అంటూ రాసిన లేఖను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.