తెలుగువారి తెరవేలుపు నందమూరి తారక రామారావు. తెలుగు చలనచిత్ర సీమ గర్వించదగ్గ గ్రేట్ లెజెండ్ ఆయన. సినిమాల్లో .. అనితర సాధ్యమైన పాత్రలు ధరించి, ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్ర వేసుకున్న మహానటుడు. పౌరాణిక పాత్రలు ఆయనకు కొట్టిన పిండి. సాంఘిక పాత్రలు అలవోకగా పోషించిన ధీశాలి. పాజిటివ్ కేరక్టర్లే కాదు నెగటివ్ కేరక్టర్లూ వేసి మెప్పించిన సాహసి స్వర్గీయ ఎన్ టి రామారావు. తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా వ్యాపింపజేసిన మహానుభావుడు ఎన్టీఆర్. ఎన్నో రకాల పాత్రలు, వేరియేషన్స్ ఉన్న పాత్రలు పోషించి విశ్వవిఖ్యాత నటసార్వభౌముడయ్యాడు. తెలుగు సినీ సింహాసంపై రారాజుగా భాసిల్లాడు. శ్రీరాముడైనా, శ్రీకృష్ణుడైనా ఇలాగే ఉంటాడు అనేలా ఆ పాత్రల పోషణ చేసి, ప్రేక్షకుల హృదయాలలో దేవుడై నిలిచాడు. ఎన్ టి రామారావు సినిమాలలో పౌరాణికాలు, చారిత్రకాలు, జానపదాలు, సాంఘికాలు, భక్తి రస చిత్రాలు… కలకాలం నిలిచిపోయేవి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఆయన జీవితాన్ని మన కళ్ళముందు ఆవిష్కరించేందుకు దర్శకుడు తేజ బయోపిక్ రూపొందిస్తున్నాడు.
ఎన్టీఆర్ బయోపిక్‌లో బాలయ్య ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ఈ చిత్రంలో 64 పాత్రలలో బాలయ్య కనిపించనున్నట్టు తెలుస్తుంది. బాలకృష్ణ కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్వి పేర్లు కలిసి వచ్చేలా బ్రహ్మ తేజ ప్రొడక్షన్ నిర్మించిన బాలయ్య ఈ బేనర్‌లో ఎన్టీఆర్ బయోపిక్ చేస్తున్నాడు. వారాహి మరియు విబ్రీ మీడియా కో ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. రామకృష్ణ స్టూడియోలో సినిమా ప్రారంభోత్సవం జరగగా, ఈ కార్యక్రమానికి వెంకయ్య నాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సినిమాటోగ్రాఫర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాఘవేంద్రరావు,బోయపాటి, వినాయక్, పూరీ జగన్నాథ్, చార్మి, కళ్యాణ్ రామ్ తదితరులు ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. పూజా కార్యక్రమం పూర్తైన తర్వాత ఓ పౌరాణిక సన్నివేశానికి సంబంధించి చిత్రీకరణ జరిపారు. దుర్యోధనుడి అవతారంలో బాలయ్య డైలాగు అదరగొట్టాడు. వెంకయ్య నాయుడు ఆ సన్నివేశానికి క్లాప్ కొట్టారు. వచ్చే నెలలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్‌ని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. కీరవాణి చిత్రానికి సంగీతం అందించనున్నారు. సంతోష్ తుండియిల్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేయనున్నారు. బుర్రా సాయి మాధవ్ చిత్రానికి మాటలు అందించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa