సినీ తారలంటే ప్రేక్షకుల్లో ఎనలేని అభిమానం ఉంటుంది. కొందరు తమ అభిమాన హీరోలు, హీరోయిన్ల సినిమాలు విడుదలైనప్పుడు థియేటర్ల వద్ద హడావుడి చేస్తారు. తమిళనాడు వంటి ప్రాంతాల్లో హీరోయిన్లకు ఏకంగా గుడి కట్టిన ఘటనలు జరిగాయి. ఇక పబ్లిక్‌లోకి వస్తే అభిమానులు వారిని చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తారు. కొన్ని సార్లు సెలబ్రెటీలకు అభిమానుల కారణంగా ఇబ్బందులు ఏర్పడతాయి. కొన్ని నిజంగా జరగుతుంటే, మరికొన్ని ప్రాంక్ పేరుతో భయపెడుతుంటారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాకు ఇదే అనుభవం ఎదురైంది. 'ది ఖత్రా ఖత్రా' షోకు ఆమె ఇటీవల వెళ్లింది. అక్కడ ఆమె తన వ్యానిటీ వ్యాన్‌లో ఫోన్ చూసుకుంటూ కూర్చుంది. అంతలో దాని బాత్‌రూమ్‌లో నుంచి ఓ వ్యక్తి బయటకు వచ్చాడు. తాను అభిమానినని, తనను పెళ్లి చేసుకోకుంటే గొంతు కోసుకుని చనిపోతానని సోనాక్షిని బెదిరించాడు. తన చేతిపై ఉన్న పచ్చబొట్టును చూపించాడు. అంతటితో ఆగకుండా రక్తంతో ఐ లవ్ యూ అని రాస్తానని కూడా సోనాక్షికి చెబుతాడు. ఇవన్నీ చూసిన సోనాక్షికి మతిపోయినంత పనైంది. ఈ క్రమంలో అదంతా ప్రాంక్ అని, 'ది ఖత్రా ఖత్రా' షో ప్రచారంలో భాగంగా అలా చేశారని తెలిసింది. దీంతో సోనాక్షి సిన్హా ఊపిరి పీల్చుకుంది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో నెట్టింట ఇది వైరల్‌గా మారింది.