తెలుగు సినీ పరిశ్రమలో తనదైన హావభావాలతో, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్న హాస్య నటుడు రాహుల్ రామకృష్ణ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'అర్జున్ రెడ్డి' చిత్రంతో ఆయనకు గుర్తింపు వచ్చింది. అనంతరం వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆయన అలరిస్తున్నారు. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో పెళ్లి చేసుకుంటున్నట్లు అభిమానులకు ఆయన గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో తాను వివాహం చేసుకుంటున్నానని ట్విట్టర్ వేదికగా ఆదివారం ప్రకటించారు. తనకు కాబోయే భార్య ఫొటోను పోస్ట్ చేశారు. అయితే ఆమె వివరాలను ఆయన వెల్లడించలేదు. 'ఎట్టకేలకు, త్వరలో పెళ్లి చేసుకోనున్నాం' అనే క్యాప్షన్ పెట్టారు. ఆయనది ప్రేమ వివాహం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ట్విట్టర్ వేదికగా ఈ జంటకు పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆయన తన ప్రేయసిని ముద్దుపెట్టుకున్న ఫొటో షేర్ చేయగా, అది నెట్టింట వైరల్ అయింది.