బ్యానర్: యువి క్రియేషన్స్, పాకెట్ సినిమా
తారాగణం: సుమంత్ అశ్విన్, నిహారిక కొణిదెల, ఇంద్రజ, నరేష్, మురళిశర్మ, పవిత్ర లోకేష్, తులసి, రాజా తదితరులు
సంగీతం: శక్తికాంత్ కార్తీక్
నేపథ్యం సంగీతం: తమన్
|కూర్పు: కె.వి. కృష్ణారెడ్డి
ఛాయాగ్రహణం: బాల్‌రెడ్డి
నిర్మాణం: పాకెట్ సినిమా
రచన, దర్శకత్వం: లక్ష్మణ్ కార్య
విడుదల తేదీ: జులై 28, 2018
ప్రేమించిన కొత్తలో ఫుల్ అటెన్షన్ ఇచ్చిన హీరో పెళ్లి నిశ్చయమైన తర్వాత హీరోయిన్ నిర్లక్ష్యం చేస్తుంటాడు. అదే కారణం మీద పాత బాయ్‌ఫ్రెండ్‌ని వదిలేసిన హీరోయిన్‌కి ధర్మ సందేహం ఎదురవుతుంది. అబ్బాయిలంతా ఇలాగే వుండేటట్టయితే, ఇక ఇప్పుడు హీరోని ఎందుకు పెళ్లి చేసుకోవాలి? అని. ఈ క్వశ్చన్‌కి ఆన్సర్... క్వశ్చన్‌లోనే వుంది. సింపుల్... హీరో కాబట్టి!రెండు క్యారెక్టర్స్‌లో ఎవరో ఒకరినే హీరోయిన్ ఎంచుకోవాల్సిన విషయంలో సంఘర్షణ ఏర్పడినపుడు ఎవరిని చివరిగా ఎంచుకుంటుందనేది తెలియనపుడు ప్రేక్షకులకి ఆసక్తి వుంటుంది. ఎలాగో ఒక క్యారెక్టర్ హీరోకిచ్చి, మరో పాత్రకి ఎవరో చిన్న యాక్టర్‌ని పెట్టినపుడు ఇక అతను సమవుజ్జీ ఎలా అవుతాడు? హీరోనుంచి హీరోయిన్‌ని ఎలా గెలుచుకుంటాడు?
ఇలాంటి ప్రిడిక్టబుల్ కాన్‌ఫ్లిక్ట్ మీద నిలబెట్టిన హ్యాపీ వెడ్డింగ్ సెట్టింగ్‌ని గట్టిగా నిలబెట్టడానికి తగ్గ ఎంటర్‌టైన్‌మెంట్ కానీ, కనక్ట్ కాగల ఎమోషన్ కానీ లేకపోవడంతో హీరో హీరోయిన్ల కలయిక ఎంత డిలే అవుతున్నా సాగతీస్తోన్న భావనే కలుగుతుంది తప్ప ఎప్పుడు కలుస్తారనే ఆసక్తి కలగదు. అవసరానికి మించిన ఉత్సాహం చూపిస్తూ సుమంత్ అశ్విన్, నిలువెత్తు నీరసానికి ప్రతీక అనిపించే పాత్రలో నిహారిక కూడా విసిగించే సరికి ఈ ప్రేమకథలో మెచ్చుకోతగ్గ లక్షణాల కంటే 'ఎందుకొచ్చామురా భగవంతుడా' అనిపించే క్షణాలే ఎక్కువయ్యాయి.
ప్రేమకథా చిత్రమనే సరికి అలరించే పాటలుంటే కొంతవరకు ఊరట. కానీ హ్యాపీ వెడ్డింగ్‌లో ఆ అదృష్టం దక్కలేదు. కనీసం కలర్‌ఫుల్ విజువల్స్ వుంటే అంతో ఇంతో కాలక్షేపం. బడ్జెట్ తక్కువ కావడంతో విజువల్స్‌లోను కళ లేదు. ఫోర్ గ్రౌండ్, బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ చేసే టెక్నిక్‌తోనే డెబ్బయ్ శాతం సినిమా తీసేసిన సినిమాటోగ్రాఫర్ తన బ్లర్‌తో అస్తమాను కళ్లజోడు తుడుచుకోవాల్సిన అవసరం కల్పించాడే తప్ప కనువిందు చేయలేకపోయాడు. తమన్ నేపథ్య సంగీతం చేసాడనే సంగతి తెలియకపోతే కనుక... సినిమా చూసేసాక ఆ సంగతి తెలిసినపుడు 'అవునా' అని ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. నస పెడుతూ పోతే రెండు గంటల సమయం గడవడం ఎంత కష్టమో ఇది డెమో ఇస్తుంది.
మామూలుగా ఎలాంటి పాత్రనయినా రక్తి కట్టించేసే టాలెంట్ వున్న నరేష్, మురళి శర్మ కూడా తమ రియాక్షన్స్ రిజిష్టర్ చేయడానికి కాస్త ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చిందంటే సీన్లో కంటెంట్ ఎంత వుందనేది స్పష్టమైపోతుంది. ఒక దశలో నిహారిక నటించడం మానేసి జస్ట్ నాగబాబుగారి అమ్మాయిలానే కెమెరా ముందు మాట్లాడేస్తోందా అనిపిస్తుంది. మోతాదుకి మించిన డెప్త్, ఎనర్జీ సుమంత్‌లో వుంటే, నిహారిక డెలివరీ మాత్రం ఎవరో అందిస్తోన్న మాటలకి ప్రామ్టింగ్ ఇస్తున్నట్టుగా తోస్తుంది.
స్టాక్ సీన్లు, స్టాక్ పాత్రలు, స్టాక్ డైలాగులతో ఇలాంటి చూసేసిన కాన్సెప్ట్‌ని, నెక్స్‌ట్ ఏమి అవుతుందో ఈజీగా గెస్ చేసేసే స్క్రీన్‌ప్లేని పెట్టుకుని, వెబ్ సిరీస్‌లు చేస్తోన్న హీరో హీరోయిన్లతో సినిమా తీసి జనాలని థియేటర్లకి రప్పించగలమనే ధీమాకి ఆశ్చర్యం కలుగుతుంది. సాధారణంగా పెళ్లి తంతుకి సంబంధించిన సినిమాల్లో వినోదానికి ఆస్కారం ఎక్కువ వుంటుంది. కానీ హ్యాపీ వెడ్డింగ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ని పక్కనపెట్టి హీరోయిన్ కన్‌ఫ్యూజన్ మీదే ఫోకస్ ఎక్కువైంది.
అసలు ఆమె కన్‌ఫ్యూజన్ దేనికో కూడా అర్థం కాదు. తనని పికప్ చేసుకోవడానికి హీరో రాలేదని, తనని నిర్లక్ష్యం చేస్తున్నాడని, టేకిట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకున్నాడనేది ఆమె కంప్లయింట్. ఇంతకుముందు తను ప్రేమించినవాడు కూడా అంతేనట. ఇప్పుడీ ఇద్దరిలో ఎవరిని పిక్ చేసుకోవాలనే అయోమయంలో పడుతుంది. ఇప్పుడున్న వాడి కంటే మునుపటి వాడు బెటర్ అంటే ఆలోచించుకోవచ్చు. లేదా ఇంతకంటే బెటర్ వాడు తారసపడితే ఇతనొద్దు అనుకోవచ్చు. కానీ ఈ కాన్‌ఫ్లిక్ట్ ఏమిటో, అసలు ఆమె కన్‌ఫ్యూజన్ ఏమిటో కూడా బోధ పడదు.
అలా అని తనకున్న సమస్యని పెద్దలతో చెబుతుందా అంటే అదీ లేదు. ఇష్టం లేదని చెబుతూనే అతనితో పెళ్లికి ముందు చేయాల్సినవన్నీ చేసేస్తుంటుంది. ఫైనల్‌గా ఇది ఎలా ఎండ్ అవుతుందనేది తెలిసినా కానీ టికెట్ కొన్నందుకు గిట్టుబాటు చేసుకుని తీరాల్సిందే అనుకుంటే తప్ప చివరి వరకు కూర్చోవడానికి తగిన కారణమే వుండదు. చిన్న చిన్న కాన్‌ఫ్లిక్ట్స్‌తో రక్తి కట్టించే ప్రేమకథలు (పెళ్లి చూపులు, ఫిదా) వస్తోన్న ఈ రోజుల్లోనే ఇంకా ఈ అవుట్ డేటెడ్ స్టఫ్‌కి ఇన్వెస్టర్స్ దొరకడం విశేషమే. కాకపోతే ఇలాంటి స్టఫ్ మీద టైమ్ అండ్ మనీ ఇన్వెస్ట్ చేసేంత ఓపిక, తీరిక ఈతరం ప్రేక్షకులకి మాత్రం లేవంతే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa