ఆ ఆడియన్స్, ఈ ఆడియన్స్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కడుపుబ్బా నవ్వించే సినిమాలు ఈమధ్య కాలంలో రావడమే మానేశాయి. అప్పట్లో జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ కేవలం హాస్యభరిత సినిమాలనే తీసి స్టార్ డైరెక్టర్లు గా పేరు తెచ్చుకున్నారు. వారు తీసిన సినిమాలలో ఎటువంటి ద్వంద్వార్ధాలు, అసభ్య పదజాలాలకు తావు లేకుండా ఆరోగ్యకరమైన కామెడీని చూపించేవారు. ఇప్పటి కాలానికి వచ్చేసరికి డబుల్ మీనింగ్ డైలాగులు, సెటైర్లు, పంచ్ లు ... ఈ జనరేషన్ వీటినే ఫన్ అనుకుంటుంది. ఈ తరానికి ఒకప్పటి కామెడీ సినిమాలు ఎలా ఉండేవో ఎఫ్ 3 సినిమాతో డైరక్టర్ అనిల్ రావిపూడి చూపించారు. అసభ్యతకు తావులేకుండా, హెల్ది కామెడీతో ప్రతిఒక్కరినీ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన సినిమా ఎఫ్ 3. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్, వరుణ్ తేజ్ ల కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ఎఫ్ 3. తమన్నా,మెహ్రీన్ కధానాయికలు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీక్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూడటానికి తహతహలాడుతున్నారు. చిన్నపిల్లలైతే మరీను. ఎఫ్ 3 చూడాలనుకునే వారిలో మన ఐకాన్ స్టార్ కూడా ఒకరు. రెండువారాల విదేశీ వెకేషన్ నుండి ఈ మధ్యనే ఇండియాకి తిరిగొచ్చిన అల్లు అర్జున్ ఎఫ్ 3 సినిమాను చూడాలని ఆత్రుతపడుతుంటే, తండ్రి అల్లు అరవింద్ హోమ్ ధియేటర్ లో కన్నా, ధియేటర్ కెళ్ళి చూడమని కొడుక్కి సలహా ఇచ్చాడట. దీంతో బన్నీ కూకట్పల్లి లోని ఒక ధియేటర్ లో ఎఫ్ 3 సినిమాను చూశాడట. మాస్క్ పెట్టుకుని, ఎవరు గుర్తుపట్టకుండా ధియేటర్ కెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేసిన బన్నీ సినిమా ఎలా ఉందో సోషల్ మీడియాలో చిన్న కామెంట్ కూడా పెట్టకపోవడం విశేషం. ఇలానే, మొన్నామధ్య సాయిపల్లవి మహేష్ నటించిన సర్కారువారిపాట సినిమాను థియేటర్లో చూసింది. ఎవరూ గుర్తు పట్టకుండా తలపై చున్నీ, మాస్క్ పెట్టుకుని అంతా బాగానే మానేజ్ చేసింది కానీ, చివరికి ధియేటర్ నుండి బయటకు వచ్చేటప్పుడు ఒక ఫ్యాన్ ఆమెను గుర్తుపట్టి వీడియో తీసాడు. సినీతారలు, సెలెబ్రిటీలు సాధారణ వ్యక్తుల్లా జీవించాలంటే, ఇలాంటి కష్టాలు తప్పవు మరి.