దగ్గుబాటి రానా, సాయిపల్లవి జంటగా నటించిన సినిమా విరాటపర్వం. వేణు ఉడుగుల డైరెక్షన్లో, 1990లలో తెలంగాణాలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతమందించారు. షూటింగ్ పూర్తయిన చాలా కాలం తర్వాత ఈ నెల 17వ తేదీన విడుదలకాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం మొత్తం ప్రమోషన్స్ కార్యక్రమాల్లో మునిగిపోయింది.
ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఒక ప్రెస్ మీట్లో రానా మాట్లాడుతూ, విరాటపర్వం చిత్రానికి సంబంధించిన ఇంటరెస్టింగ్ విషయాలను వెల్లడించారు. అసలీ సినిమా తన వద్దకు ప్రొడ్యూస్ చెయ్యమని వచ్చిందని, కథ నచ్చి రవన్న పాత్రను తానే పోషించాలని నిర్ణయించుకున్నట్టు రానా తెలిపారు. సినిమా మొత్తం సాయిపల్లవి చుట్టూనే తిరుగుతుందని, తాను లేకపోతే సినిమా మరీ చిన్నదైపోతుందని, అందుకే ఈ సినిమాలో కీలక పాత్రను పోషించినట్టు తెలిపారు. అడవి నేపథ్యంలో సాగే ప్రమాదకరమైన ప్రేమకథగా విరాటపర్వం చిత్రం సాగుతుందని, కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన సింధూరం, అంతఃపురం సినిమాల తర్వాత అందరూ మాట్లాడుకునే సినిమాగా విరాటపర్వం నిలుస్తుందని రానా తెలిపారు.