భారతీయ చిత్రసీమకున్న అతికొద్ది ఉత్తమ నటుల్లో కమల్ హాసన్ ఒకరు. 60 సంవత్సరాల సుదీర్ఘ కాలంపాటు చిత్రసీమలో ఉంటూ, డైరెక్షన్, ప్రొడక్షన్, మ్యూజిక్ వంటి రంగాల్లో తనదైన ప్రతిభను చాటుతూ, విభిన్నమైన సినిమాలకు పెట్టింది పేరుగా, విలక్షణ నటుడిగా ప్రేక్షకుల హృదయాల్లో తిరుగులేని స్థానం సంపాదించాడు.
నవరసాల్లో కామెడీ పండించడం అనేది కత్తిమీద సాములాంటిది. కామెడీ టైమింగ్ కాస్త అటూఇటూ అయినా సీన్ పండదు. కామెడీని సైతం భేషుగ్గా చెయ్యగల కొందరు స్టార్ హీరోలలో కమల్ ముందు వరసలో ఉంటారు. మరి అలాంటి కమల్ గత కొన్నాళ్లుగా కామెడీ జోనర్ లో సినిమాలను చెయ్యటమే మానేశారు. ఆయన నటించిన లాస్ట్ కామెడీ ఫిలిం మన్మధబాణం. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా పరాజయం పాలైంది. ఆ తర్వాత శభాష్ నాయుడు అనే స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకుని, షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. టీకే రాజీవ్ కుమార్ డైరెక్షన్ లో 2016 లో ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పటికీ షూటింగ్ పూర్తి చేసుకోలేదు. ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడటానికి అనేక కారణాలున్నాయి. ముందుగా డైరెక్టర్ రాజీవ్ కుమార్ మరణించడంతో స్టార్ట్ అయితే, ఆ తర్వాత ఎడిటర్ జేమ్స్ జోసెఫ్ ప్రాజెక్టు నుండి తప్పుకోవడం, సినిమాటోగ్రాఫర్ ను మార్చడం, కమల్ కాలికి గాయం, గౌతమితో విడాకులు, పొలిటికల్ ఎంట్రీ... ఇలాంటి అనుకోని ఘటనలతో ఈ సినిమా కాస్త వాయిదా పడుతూ వచ్చింది. అయితే, ఈ సినిమాను పునఃప్రారంభించే ఆలోచనలున్నాయని ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో కమల్ హాసన్ తెలిపారు. త్వరలోనే శభాష్ నాయుడు పై ఒక నిర్ణయం తీసుకుంటానని, ఆ మూవీకి సంబంధించిన IPR రైట్స్ కూడా తనదగ్గరే ఉన్నాయని కమల్ పేర్కొన్నారు.