మొన్నీమధ్య వరకు కూడా విరాటపర్వం సినిమా విడుదలవుతుందో లేదో అని అభిమానులు ఖంగారు పడ్డారు. అభిమానుల మొర ఆలకించిన చిత్రబృందం విరాటపర్వం సినిమాను జూన్ 17న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెలంగాణా లో నడిచే హృద్యమైన ప్రేమ కధగా దర్శకుడు వేణు ఉడుగుల విరాటపర్వం చిత్రాన్ని తెరకెక్కించారు. దగ్గుబాటి రానా, సాయిపల్లవి జంటగా నటించారు. ఇంకా ఈ సినిమాలో జరీనా వాహబ్, ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర వంటి ప్రముఖ నటులు కీలకపాత్రలు పోషించారు. ఇంతటి భారీ క్యాస్ట్ సినిమాలో ఉన్నాకానీ మేకర్స్ మాత్రం ఒక్క సాయిపల్లవి స్టార్డం మీదనే ఆధారపడి సినిమాను ప్రోమోట్ చేస్తున్నారు. హీరో రానా సైతం ఒకడుగు వెనక్కి తగ్గి విరాటపర్వం ప్రమోషన్స్ లో సాయి పల్లవిని హైలైట్ చేసారు. ఆదివారం కర్నూలు లో జరిగిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో సాయి పల్లవి క్రేజ్ ను తెలిపే పలు వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
వాస్తవానికి సాయి పల్లవి సినిమాల ప్రమోషన్స్ లో అంత చురుగ్గా పాల్గొనదు. ప్రీ రిలీజ్ ఈవెంట్, రెండు మూడు ఇంటర్వ్యూలలో పాల్గొని మమ అనిపిస్తుంది. కానీ విరాటపర్వం ప్రమోషన్స్ విషయంలో సాయి పల్లవి చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని తెలుస్తుంది. ఈ మూవీని జనాల్లోకి మరింతగా తీసుకువెళ్లేందుకు పల్లవి మరిన్ని ఎక్కువ షోలలో, ఇంటర్వ్యూలలో పాల్గొననున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సర్కార్ 2 టాక్ షో పల్లవి పాల్గొంది. రానున్న కాలంలో మరిన్ని ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పల్లవి పాల్గొంటుంది. మేకర్స్ పెట్టుకున్న భారీ అంచనాలను సాయి పల్లవి ఏమేరకు అందుకుని విరాటపర్వం సినిమాను ఘనవిజయం సాధించేలా చేస్తుందో చూడాలి.