ఈ మధ్య వస్తున్న సినిమాలు థియేటర్లలో విడుదలవక ముందే శాటిలైట్, డిజిటల్ రైట్స్ ను అధిక ధరకు అమ్ముకుంటున్నాయి. ఇది మంచి పద్ధతే..,కానీ మూడు, నాలుగు వారాలకే ఆయా సినిమాలను ఓటిటీ లో స్ట్రీమింగ్ చెయ్యటం మంచిది కాదని, ఇలా అయితే థియేటర్లు త్వరలోనే మూత పడతాయని, థియేటర్లో సినిమా జీవితకాలం బాగా తగ్గిపోతుందని, థియేటర్లో సినిమా విడుదలైన 60 రోజులు అంటే రెండు నెలల తర్వాతనే డిజిటల్ స్ట్రీమింగ్ చెయ్యాలని, అప్పుడే చిత్రపరిశ్రమ అభివృద్ధి చెందుతుందని ఇటీవల జరిగిన ఒక మూవీ ఫంక్షన్లో నిర్మాత అల్లుఅరవింద్ తన గళాన్ని వినిపించారు. అల్లు అరవింద్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న కొన్ని సినిమాలు ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ కు రావట్లేదని ప్రకటించేసాయి. ఎఫ్ 3, మేజర్ వంటి సినిమాలు డిజిటల్ రంగానికి రావాలంటే ఇంకా రెండు నెలలు ఆగాల్సిందే.
తాజాగా నాచురల్ స్టార్ నాని నటించిన అంటే సుందరానికి చిత్రం కూడా ఇదే బాటలో నడుస్తుంది. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో నాని, నజ్రియా జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అంటే సుందరానికి. జూన్ 10న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన శాటిలైట్, డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని, మూడు వారాల గడువులోనే ప్రముఖ ఓటిటిలో స్ట్రీమింగ్ అవబోతుందని పలు రకాల వార్తలు ప్రచారంలోకొచ్చాయి. ఈ వార్తలను నాని పుకార్లుగా కొట్టి పారేస్తూ, అంటే సుందరానికి మూవీ టీం ఏ ఓటిటి సంస్థతోను ఇలాంటి డీల్ కుదుర్చుకోలేదని చెప్పారు. మూడు వారాల గడువులో మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అవదని తేల్చి చెప్పేసారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో మహేష్ నటించిన సర్కారువారిపాట నెలలోపే డిజిటల్ ఎంట్రీ ఇవ్వగా, నాని మూవీ విషయంలో మైత్రి మూవీ మేకర్స్ ఇలాంటి నిర్ణయం తీసుకోవటం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మైత్రి వారు తీసుకున్న నిర్ణయానికి ప్రధాన కారణం నాని అని తెలుస్తుంది.