టాలీవుడ్ లో విడుదలైన సినిమాలలో తనకు నచ్చిన సినిమా గురించి ఓపెన్ గా మాట్లాడటం, సోషల్ మీడియా ద్వారా ఆయా చిత్రబృందాలకు శుభాకాంక్షలను అందజేయడం ఎప్పటినుండో మెగాస్టార్ కు పరిపాటిగా మారింది. ఒక్కోసారి తన స్వగృహంలో విందు ఏర్పాట్లు చేసి వారిని సంతోషపెడుతుంటారు. తాజాగా అడవిశేష్ నటించిన మేజర్ టీం కు మెగాస్టార్ ఇంట భోజనం చేసే అద్భుతమైన అవకాశం దక్కింది.
శశికిరణ్ తిక్కా డైరెక్షన్లో, 2008 ముంబై మహానగర దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ గా తెరకెక్కిన మేజర్ లో అడవిశేష్ లీడ్ రోల్ లో నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడమే కాక ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైంది. ఈ సినిమాను ఇటీవలే చూసిన మెగాస్టార్ మేజర్ టీం మొత్తాన్ని తన ఇంటికి ఆహ్వానించి, కమ్మని విందును ఏర్పాటు చేసి, ఎన్నో విషయాల గురించి మాట్లాడినట్టు తెలుస్తుంది. మేజర్ పై ప్రశంసలు కురిపిస్తూ మెగాస్టార్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. అలానే ఇంతమంచి సినిమాను దేశప్రజలకు అందించినందుకు నిర్మాత మహేష్ బాబుగారికి చిరు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియచేసారు.
మెగాస్టార్ ఇంట తమకు దక్కిన అరుదైన గౌరవాన్ని అడవిశేష్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియచేసాడు. అద్భుతమైన భోజనాన్ని, కొన్ని గంటలపాటు మీతో గడిపే బంగారు అవకాశాన్ని మాకు కల్పించినందుకు కృతజ్ఞతలు.... సినిమా పట్ల మీ ప్రేమ, మీ ఆలోచనలు, బంగారం లాంటి మీ మనసు ఈరోజు నేను కళ్లారా చూడగలిగాను...అంటూ శేష్ ట్వీట్ లో పేర్కొన్నాడు.