గోపీచంద్ మలినేని డైరెక్షన్లో చేసిన "క్రాక్" సినిమాతో, రవితేజ అప్పటి వరకు తనను పట్టిపీడిస్తున్న అపజయాల నుండి కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. క్రాక్ విజయాన్ని ఖిలాడీ తో కొనసాగించాలనుకున్న రవితేజ ఆశలు అడియాసలే అయ్యాయి. ఖిలాడీ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో ఈసారి ఎలా అయినా హిట్ కొట్టి తీరాలని రామారావు ఆన్ డ్యూటీ, ధమాఖా, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలపై రవితేజ పూర్తి ఫోకస్ పెట్టాడు.
కొత్త దర్శకుడు శరత్ మండవ డైరెక్షన్లో రవితేజ "రామారావు ఆన్ డ్యూటీ" సినిమాను చేస్తున్నారు. ఈ చిత్రంలో 'మజిలీ' ఫేమ్ దివ్యాన్ష కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటున్న ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా జూన్ 17న విడుదల కావాల్సివుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతుండటం వలన సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. ఇందుకు ప్రధాన కారణంగా డైరెక్టర్ శరత్ పేరు వినబడుతుంది.
రామారావు ఫైనల్ రషెస్ చూసిన రవితేజ, తీవ్ర అసంతృప్తికి గురయ్యాడట. కొన్ని సీన్లను రీషూట్ చేస్తే బావుంటుందని డైరెక్టర్ కు చెప్పాడట. టైగర్ నాగేశ్వరరావు షూటింగ్ లో మోకాలికి గాయమైన రవితేజ్ కొద్దిరోజులు రెస్ట్ తీసుకుని రామారావు సెట్స్ లో జాయిన్ అయ్యి కొన్ని సీన్లను రీషూట్ చేస్తున్నాడని సమాచారం. దీంతో నిర్మాతకు తడిసి మోపెడవుతుందట.
ఈ రోజుల్లో ఒక యావరేజ్ ఔట్ పుట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే కన్నా, రీషూట్లు చేసి థ్రిల్లింగ్ ఔట్ పుట్ తోనే సినిమాను విడుదల చెయ్యటం ఉత్తమం. కానీ ఇలా చెయ్యటం వల్ల నిర్మాతకు భారమవుతోంది. మరి ఇదే సమస్యతో తల్లడిల్లుతున్న రామారావు ప్రేక్షకుల ముందుకొచ్చేదెప్పుడో ... కొత్త దర్శకుడు తొలి ప్రయత్నంతో ప్రేక్షకులను మెప్పిస్తాడో ? లేదో? చూడాలి.