చాందిని చౌదరి... ఈ పదహారణాల తెలుగమ్మాయి ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ఉంది కానీ, 2020లో వచ్చిన "కలర్ ఫోటో" తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక అప్పటినుండి చాందినికి వరస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో ఆమె నటించిన కొత్త చిత్రం "సమ్మతమే". గోపినాధ్ రెడ్డి డైరెక్షన్లో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరో కాగా, చాందిని ఆయనకు జోడీగా నటించింది. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ, ప్రస్తుతం ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది.
రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కెరీర్ కు సంబంధించి చాందిని షాకింగ్ విషయాలను బయటపెట్టింది. పెద్దగా సినిమాలు నిర్మించని ఒక బడా ప్రొడక్షన్ హౌస్ లో ఒక సినిమాకు కమిటైన చాందిని, ఆ సినిమా పూర్తయ్యేంతవరకు మరో సినిమాలో నటించకూడదని ఆ నిర్మాత చాందినిని, ఆమె ఫ్యామిలీని బెదిరించాడని తెలిపింది. ఈ నేపథ్యంలో చాందిని నాలుగు సూపర్ హిట్ సినిమాల ఛాన్సులు వదులుకుంది. నాగశౌర్య హీరోగా చేసిన ఊహలు గుసగుసలాడే, రాజ్ తరుణ్ హీరోగా చేసిన కుమారి 21F సినిమాల్లో హీరోయిన్ ఛాన్సులు ముందుగా తన దగ్గరకే వచ్చాయని, సదరు ప్రొడక్షన్ హౌజ్ అగ్రిమెంట్ ప్రకారం, వేరే సినిమాలలో నటించకూడదు కాబట్టి వాటిని వదులుకున్నట్టు చాందిని తెలిపింది. చాందిని వదులుకున్న ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్, ఈ సినిమాలతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీఖన్నా, హెబ్బా పటేల్ ప్రస్తుతం స్టార్ ఇమేజ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
ఇదే సమయంలో పటాస్, దృశ్యం సినిమాలలో నటించే అద్భుతమైన అవకాశాలను వదులుకున్నట్టు చాందిని తెలిపింది. ఈ నాలుగు సినిమాలను కనక చాందిని చేసుంటే... చాలా కాలం తర్వాత ఒక తెలుగమ్మాయికి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హోదా దక్కేది.