"ఉప్పెన" సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమపై ఎగసిపడిన యువ కెరటం వైష్ణవ్ తేజ్. తొలి సినిమాతోనే వంద కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరిన ఈ యువహీరో ఆపై చేసిన కొండపొలం తో భారీ డిజాస్టర్ ను చవిచూశాడు. మూడో సినిమా "రంగరంగ వైభవంగా" విడుదలకు సిద్ధంగా ఉండగా, తాజాగా వైష్ణవ్ నాలుగో సినిమాను అధికారికంగా ఎనౌన్స్ చేసాడు.
పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ఈ రోజు ప్రారంభమైన వైష్ణవ్ నాల్గవ సినిమాను కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి డైరెక్ట్ చేస్తుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వైష్ణవ్ కు జోడిగా యంగ్ బ్యూటీ "పెళ్ళిసందడి" ఫేమ్ శ్రీలీల నటిస్తుంది. ఎనౌన్స్మెంట్ టీజర్ పేరిట ఒక వీడియోను మేకర్స్ కొంచెంసేపటి క్రితమే విడుదల చేసారు. మొదటి రెండు సినిమాలలో లేనివిధంగా ఈ సినిమాలో వైష్ణవ్ తనలోని మాస్ యాంగిల్ ను పూర్తిగా ఆవిష్కరించబోతున్నట్టు తెలుస్తుంది. విడుదల చేసిన పోస్టర్ లో గుబురు గడ్డం, చెదిరిన జుట్టు తో వైష్ణవ్ లుక్ కూడా చాలా కొత్తగా ఉంది. విలన్ తో వైష్ణవ్ చెప్పే గోదావరి యాసలోని డైలాగులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. #PVT 04 వర్కింగ్ టైటిల్ తో ఈ రోజు నుండి షూటింగ్ జరుపుంటున్న ఈ మూవీ వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.