అందరూ గర్వించేవిధంగా మణికర్ణిక చిత్రం రూపుదాలుస్తోందని టైటిల్ పాత్రధారి కంగనారనౌత్ అంటోంది. వీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. క్రిష్ దర్శకుడు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంతో క్రిష్ బిజీగా ఉండటంతో ఓ షెడ్యూల్‌కు కంగన దర్శకత్వం వహించారు. దాదాపు 45 రోజులు జరిగిన షెడ్యూల్ కంగన దర్శకత్వంలోనే జరిగిందట. టైటిల్స్‌లో సహాయ దర్శకురాలిగా తన పేరు వేయొద్దని కంగన హుందాగా కోరుతుందోట. తనతో పాటు భారతీయులంతా గర్వించేవిధంగా ఉంటుందని కంగన చెబుతోంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేస్తారని..జనవరి 25న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావాలన్నది చిత్రబృందం లక్ష్యం. ఇదిలావుండగా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం మొదలైనప్పట్నుంచి ఏవో ఆటంకాలు ఎదురవుతూనే వచ్చాయి.చిత్రీకరణలో కంగన రెండుసార్లు గాయపడింది.ఈ చిత్రం పూర్తికాక మునుపే క్రిష్‌కు ఉన్నట్లుండి ఎన్టీఆర్ బయోపిక్‌కు దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. మరోవైపు నటుడు సోనూసూద్ ఈ చిత్రం నుంచి వైదొలగారు. దాంతో ఆయన పాత్రను మహ్మద్ జీషాన్ పోషిస్తున్నారు. తాజాగా కీలక పాత్ర పోషిస్తున్న నటి స్వాతి సెమ్వాల్ (బరైలీకీ బర్ఫీ ఫేమ్) కూడా తప్పుకున్నట్లు సమాచారం. సోనూసూద్ ఈ చిత్రంలో నటించినపుడు ఆయన భార్య పార్వతి పాత్రలో ఆమె నటించింది.తన పాత్రకు ప్రాధాన్యం లేదన్న ఉద్దేశ్యంతోనే ఆమె ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేసినట్లు వినిపిస్తోంది. ఆ మధ్య బడ్జెట్ మరింత ఎక్కువ కావడంతో నిర్మాతలు కూడా మారినట్లు వినిపించింది. అయితే దీనిపై ఇంతవరకు స్పష్టత రాలేదు. ఏదిఏమైనా అవరోధాలను అధిగమించి చిత్రం ఇంతవరకు ఓ దశకు చేరుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa