నాగశౌర్య హీరోగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి'. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా చిత్ర నిర్మాత ఉషా మూల్పూరి మీడియాతో ముచ్చటిస్తూ ఇలా అన్నారు ‘కృష్ణ వ్రింద విహారి' కమర్షియల్ ఎంటర్ టైమెంట్ ఫ్యామిలీ మూవీ. ఈ కథకి ఒక తల్లిగా కనెక్ట్ అయ్యాను. ఈ చిత్రంలో నాగశౌర్య ఒక పల్లెటూరి కుర్రాడిగా, బ్రాహ్మిన్ కుర్రాడిగా, సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా, కొడుకుగా, ప్రేమికుడిగా, భర్తగా, స్నేహితుడిగా ఇలా భిన్నమైన కోణాల్లో కనిపిస్తాడు. ఆయన కెరీర్‌లో ‘కృష్ణ వ్రింద విహారి' ఒక బెస్ట్ మూవీ అవుతుందని భావిస్తున్నాను.
ఈ చిత్రంలో 200 మంది డ్యాన్సర్‌తో కలిసి చేసిన పాటకు మంచి స్పందన లభించింది. సినిమాలో ఓ మంచి సందర్భంలో ఈ పాట వస్తుంది. విజయ్ మాస్టర్ చక్కని కొరియోగ్రఫీ చేశారు. డీవోపీ సాయిశ్రీరామ్ కూడా చాలా అందంగా ఆ పాటని చిత్రీకరీంచారు. రిలీజ్ అయిన తర్వాత ఈ పాటకు మరింత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. 95 శాతం సినిమా పూర్తయింది. ఇప్పటివరకూ వచ్చిన అవుట్ పుట్ పై నిర్మాతగా చాలా ఆనందంగా ఉన్నాను. ఈ సినిమా చేస్తున్నపుడు నిర్మాతగా నేను ఎలాంటి ఒత్తిడి లేదు. అద్భుతమైన కథ. ఆ కథకు తగ్గట్టు నటీనటులు, సాంకేతిక నిపుణలని ఎంపిక చేసుకున్నాం. ఈ సినిమాపై మాకు చాలా నమ్మకం ఉంది. సినిమా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. శౌర్య అద్భుతంగా చేశాడు. రాధిక, వెన్నెల కిషోర్, బ్రహ్మజీ, రాహుల్ రామకృష్ణ, సత్య అందరి పాత్రలు బావుంటాయి. దర్శకుడు అనీష్ తనదైన శైలిలో ఈ చిత్రాన్ని అద్భుతంగా డీల్ చేశారు. సినిమా అందరికీ నచ్చుతుంది.