టాలీవుడ్ ప్రముఖుడు నటుడు అక్కినేని నాగార్జున నేడు తన 63వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఇద్దరు కొడుకులకు తండ్రైన నాగార్జున.. తన కొడుకులకు అన్నలా కనిపిస్తారంటే అతిశయోక్తి కాదు. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించిన నాగార్జున, విక్రమ్ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మజ్ను సినిమాతో మొదటి సూపర్ హిట్ ను అందుకున్నారు. తెలుగు, తమిళ, హిందీ సహా 100కి పైగాచిత్రాలలో నటించారు. ఈరోజు నాగార్జున 63 వ పుట్టినరోజు సందర్భంగా.. ఆకట్టుకునే శరీరాకృతికోసం ఆయన తీసుకునే శ్రద్ద ఏమిటో తెలుసుకుందాం. నాగార్జున. పలు ఇంటర్వ్యూలలో తన పరిపూర్ణమైన, అందమైన శరీరాకృతి కోసం ఎలా పని చేసారో చెప్పారు. దినచర్యలో భాగంగా ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేస్తారు. అల్పాహారం నుండి రాత్రి భోజనం వరకు నిర్దిష్టమైన పద్దతిని అనుసరిస్తారు. నాగ్ రోజు.. ఉదయం 6 గంటలకు జిమ్ తో ప్రారంభమవుతుంది. ఒక గంట పాటు వ్యాయామం చేస్తారు. అల్పాహారంగా గుడ్డులోని తెల్లసొన, బ్రెడ్‌ని తీసుకుంటారు. మళ్ళీ ఉదయం 11 గంటలకు రెండవ సారి అల్పాహారంలో భాగంగా పొంగల్, దోస, ఇడ్లీ వంటి దక్షిణ భారతీయ వంటకాలను తీసుకుంటారు. మధ్యాహ్న భోజనంలో భాగంగా అన్నం, రోటీ,నాలుగు రకాల కూరగాయలతో దేశీ భోజనం చేస్తారు. భోజనానికి ముందు పండ్లు తింటారు. చివరగా, రాత్రి 7 గంటలకు రాత్రి భోజనానికి కాల్చిన చికెన్ లేదా చేపలతో ఉడికించిన కూరగాయలను తింటారు. రాత్రి 10 గంటలకు నిద్రపోతారు.
తాను ఆహార ప్రియుడునని నాగార్జున డైటింగ్ చేయడం తనకు ఇష్టం ఉందని పలు సందర్భాల్లో చెప్పారు నాగార్జున. అయినప్పటికీ తన ఆరోగ్య అలవాట్లతో ఆకట్టుకునే శరీరాకృతికి 50 శాతం కారణమని… మిగిలినవి వర్కవుట్‌లు కారణమని చెప్పారు. వారానికి ఆరు రోజులు వర్కవుట్స్ చేస్తానని.. ఈ షెడ్యూల్‌ను ఎప్పుడూ దాటవేయలేదని నాగార్జున చెప్పారు.