పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాతృమూర్తి కొణెదల అంజనాదేవి నాలుగు లక్షల రూపాయల విరాళాన్ని జనసేన పార్టీకి అందచేశారు.హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ మేరకు చెక్కును పార్టీ అధ్యక్షుడు,ఆమె కుమారుడు పవన్ కళ్యాణ్ కి అందచేశారు.
ఈ సందర్భంగా అంజనాదేవి తనను కలసిన జనసేన పార్టీ ప్రతినిధులతో మాట్లాడుతూ పోలీస్ వుద్యోగం ఎంతో శ్రమ,బాధ్యతతో కూడుకున్నదని అంటువంటివారి కుటుంబాలకు అండగా నిలవాలని తన కుమారుడు పవన్ కళ్యాణ్ ను అడిగినట్లు చెప్పారు.ఎందుకంటే పోలీస్ వుద్యోగం తనకు బాగా తెలుసునని,తన తాత గారు బ్రిటిష్ హయాంలో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేశారని,తన తండ్రి ఎక్సయిజ్ శాఖలో సర్కిల్ ఇన్స్ పెక్టర్ గా పశ్చిమగోదావరి జిల్లాలో పనిచేసేవారిని చెప్పారు.తన తండ్రిగారి వుద్యోగం రీత్యా తాము పశ్చిమ గోదావరి జిల్లాకు మారినట్లు తెలిపారు. ఎక్సయిజ్ శాఖలోనే కానిస్టేబుల్ గా పనిచేసే కొణెదల వెంకట్రావు తో తనకు వివాహం అయిందని,ఆ శాఖలో అనేక పదోన్నతలు పొంది అసిస్టెంట్ సూపరింటెండెంట్ గా వెంకటరావు రిటైర్ అయినట్లు అంజనా దేవి గుర్తుచేసుకున్నారు. వెంకట్రావు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసినందువల్లే ఇప్పటికి తనకు పెన్షన్ వస్తుందని,ఆ పెన్షన్డబ్బుతోనే ఇప్పుడు పార్టీ కి నాలుగు లక్షల రూపాయల విరాళాన్ని అందచేసినట్లు ఆమె ఆనందం వ్యక్తంచేశారు.
పార్టీ కార్యాలయానికి వచ్చిన తన మాతృమూర్తికి పవన్ కళ్యాణ్ పుష్పగుచ్ఛం ఇచ్చి సాదరంగా ఆహ్వానించి ఆమె పాదాలను తాకి నమస్కరించారు.
పార్టీ నేత శ్రీ నాదెండ్ల మనోహర్ అంజనాదేవికి నమస్కరించగా…ఆయన తండ్రి నాదెండ్ల భాస్కర రావు ఉత్తర్వు కారణంగా తన కుటుంబానికి కలిగిన మేలును గుర్తుచేసుకున్నారు.అనాటి ఎన్టీ రామారావు ప్రభుత్వం ఉద్యోగుల వయోపరిమితిని 55 సంవత్సరాలకు తగ్గించగా, నాదెండ్ల భాస్కర రావు ముఖ్యమంత్రి కాగానే వయోపరిమితిని 58 ఏళ్లకు పెంచారని,దీని కారణంగా తన భర్తకు మరో మూడేళ్ళ పాటు ప్రభుత్వానికి సేవలందించే అవకాశం కలిగిందని, ఇది తమ కుటుంబానికి ఎంతో ఆనందం కలిగించిందని అంజనాదేవి తెలిపారు.పార్టీ కార్యాలయానికి తొలిసారిగా వచ్చిన అంజనాదేవి ఒక గంటసేపు గడిపారు.
అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “ప్రభుత్వోద్యోగి కొడుకుగా నాకు పెన్షన్ విలువ తెలుసు. అందుకే ప్రభుత్వోద్యోగులు సి.పి.ఎస్. విధానం రద్దు కోసం చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తున్నాను. వారికి న్యాయం జరిగే వరకు అండగా నిలుస్తాను” అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa