సూపర్ స్టార్ హీరో కృష్ణ మరణంతో తెలుగు అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. అతని తల్లిదండ్రులకు కృష్ణను ఇంజనీరును చేయాలన్న కోరిక ఉండేది. అందుకోసం ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ సీటు కోసం ప్రయత్నించి, గుంటూరు కళాశాలలో దొరకకపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఎంపీసీ గ్రూపులో ఇంటర్ చేరాడు. అక్కడ మూడు నెలలే చదివి, ఏలూరులోని సి.ఆర్.రెడ్డి కళాశాలకు మారాడు. అక్కడే ఇంటర్మీడియట్ పూర్తిచేసి తర్వాత బీఎస్సీ చదివాడు. సి.ఆర్.రెడ్డి కళాశాలలో కృష్ణ, తర్వాతి కాలంలో సినిమాల్లో నటునిగా ఎదిగిన మురళీమోహన్ క్లాస్‌మేట్లు, మంచి స్నేహితులు. కృష్ణ డిగ్రీ చదువుతుండగా ఏలూరులో ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు ఘనంగా పౌర సన్మానం జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరైన కృష్ణకు నాగేశ్వరరావు నటుడు కావడం వల్లనే ఆ స్థాయిలో ప్రజాభిమానం పొందగలుగుతున్నాడని అర్థం చేసుకుని సినీ నటుడు కావాలన్న అభిలాష పెంపొందించుకున్నాడు. డిగ్రీ పూర్తిచేశాక ఇంజనీరింగ్ కోసం ప్రయత్నించినా కృష్ణకు సీటు రాలేదు. దాంతో కృష్ణ విద్యార్థి జీవితం ముగిసింది.