స్వరకర్త, ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కు తమిళనాడు తిరువళ్లూరు జిల్లా గుమ్మడిపూడి కవిరపేటలో సొంత ఫిలిం స్టూడియో ఉంది. ప్రస్తుతం ఈ స్టూడియోలో ఓ తమిళ సినిమా షూటింగ్ జరుగుతుండగా బుధవారం 30 అడుగుల ఎత్తులో లైట్ బిగించే క్రమంలో ఓ వ్యక్తి కిందపడ్డాడు. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
ఈ షూటింగ్ కోసం 30 అడుగుల ఎత్తులో లైట్ వెలిగిస్తున్న సమయంలో కుమార్ అనే లైట్ మ్యాన్ ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. వెంటనే స్పందించిన సిబ్బంది అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే 30 అడుగుల ఎత్తు నుంచి కిందపడటంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. లైట్ మెన్ మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.