యువ గాయకుడు అర్మాన్ మాలిక్ హిందీలో మాత్రమే కాకుండా సౌత్ భాషల్లో కూడా పాటలు పాడుతూ దూసుకుపోతున్నాడు. అర్మాన్ మాలిక్ గత కొన్నేళ్లల్లో తెలుగులో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు తన గాత్రం అందించాడు. అలవైకుంఠపురములో ఫేమస్ బుట్టబొమ్మ సాంగ్ పాడింది ఇతడే. అంతేకాకుండా వకీల్ సాబ్, టాక్ జగదీశ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, మేజర్, సమంత శాకుంతలం చిత్రాల్లో కూడా అర్మాన్ మాలిక్ పాటలు పాడాడు.
అయితే ప్రస్తుతం అర్మాన్ మాలిక్ పేరుతో ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అర్మాన్ మాలిక్ గర్భంతో ఉన్న తన భార్యలిద్దరిపై చేయి చేసుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అర్మాన్ మాలిక్ కి ఇంతవరకు పెళ్లి కాలేదు. అలాంటిది అతడికి ఇద్దరు భార్యలు ఎలా వచ్చారు ?
అర్మాన్ మాలిక్ పేరుతో ఓ యూట్యూబర్ కూడా ఉన్నాడు. అతడు హిందీలో బాగా పాపులర్ అయ్యాడు. ఫ్రాంక్ వీడియోలు చేస్తుంటాడు. అతడి ఇద్దరు భార్యలు గర్భంతో ఉన్నారు. వారి చెంప చెళ్లుమనిపించినట్లు వీడియో పోస్ట్ చేశాడు. చివరికి ఫ్రాంక్ అంటూ సర్పైజ్ ఇచ్చాడు. అయితే అతడి అసలు పేరు సందీప్. ఈ న్యూస్ వైరల్ కావడంతో సింగర్ అర్మాన్ మాలిక్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాడు. ముందు అతడిని అర్మాన్ మాలిక్ అని పిలవడం ఆపండి. నా పేరుతో ప్రతి రోజు ఇలాంటి ఆర్టికల్స్ చూస్తుంటే చిరాకు వస్తోంది అని ట్వీట్ చేశాడు.
అర్మాన్ మాలిక్ ట్వీట్ పై యూట్యూబర్ సందీప్ స్పందిస్తూ.. ఈ ప్రపంచంలో అర్మాన్ మాలిక్ పేరుతో ఒక్కరే ఉండాలి అని రూల్ ఉందా.. మీరంటే బాలీవుడ్ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చి ఫేమస్ అయ్యారు. నేను ఇలా వీడియోలు చేస్తూ గుర్తింపు సాధిస్తున్నా. దీంట్లో మీకు పోయేది ఏముంది అంటూ కామెంట్స్ చేశాడు.