‘పుష్ప’లో నటనకుగానూ ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు అందుకుని చరిత్ర సృష్టించారు అల్లు అర్జున్. తెలుగు సినిమా చరిత్రలో ఎవరూ సాధించని ఘనతను అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఉత్సాహంతోనే ఆయన ‘పుష్ప2’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. బుధవారం విడుదల చేసిన మేకింగ్ వీడియో ఆ అంచనాలను రెట్టింపు చేసింది. తాజాగా ఓ ఇంగ్లిస్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్జున్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘‘పుష్ప’లోని పాత్రలు అన్ని భాషల వారికీ కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేశారు. కథ చెప్పే విధానంలో ప్రామాణికత, వాస్తవికత అనుసరించడంతో పాటు, మూలాల్లోకి వెళ్లి మరీ ప్రతి పాత్రనూ తీర్చిదిద్దారు. ఎవరో ఒకరిని ఫాలో అయ్యి, ఇమిటెట్ చేసి సినిమా చేసేద్దామని అనుకోలేదు. నేచురల్‌గా ఉండాలని అదే సమయంలో అందరి దృష్టిని ఆకర్షించేందుకు కృషి చేశాం. మేము మరీ లోకల్‌కు వెళ్లాం... అదే మమ్మల్ని గ్లోబల్ స్థ్థాయికి తీసుకెళ్లింది. ‘పుష్ప’ విజయంతో రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్పను మించి ‘పుష్ప: ది రూల్’ ఉంటుంది. ఎంతలా అంటే సినిమా చూస్తున్నప్పుడు మీ గుండె వేగం రెట్టింపు అవుతుంది. ఎలివేషన్ సీన్స్ వచ్చినప్పుడు మీ శరీరంలోని రక్తం పరుగులు తీస్తుంది. రోమాలు నిక్కబోడుస్తాయి’’ అని అన్నారు.అంతే కాదు హాలీవుడ్ ఎంట్రీ గురించి కూడా బన్నీ స్పష్టత ఇచ్చారు. ‘‘ప్రతి భారతీయ నటుడు గ్లోబల్ స్థ్థాయిలో ఆలోచించాలి. ఎందుకంటే భారత్ అత్యంత శక్తిమంతమైన దేశంగా అవతరించబోతోంది. వ్యాపార పరంగానే కాదు, సినిమా రంగంలోనూ భారత్ మరింత పెద్ద స్థాయికి చేరుకుంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొరియన్ డ్రామాలకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. అలాగే, రాబోయే పదేళ్లలో భారతీయ సినిమాను ప్రపంచం మొత్తం చూస్తుంది. ఇది నిజంగా భారతీయ వినోద రంగానికి ఒక స్వర్ణయుగం’’ అని అల్లు అర్జున్ చెప్పారు.