రామ్ కిరణ్, మేఘా ఆకాశ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సఃకుటుంబనాం’. ఉదయ్ శర్మ దర్శకుడు. హెచ్.మహదేవ్ గౌడ, హెచ్.నాగరత్నం నిర్మాతలు. ఆదివారం హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ఏ.ఎం.రత్నం క్లాప్ ఇచ్చారు. చిన్ని ప్రకాశ్ స్విచ్చాన్ చేశారు. ‘‘కథ వినగానే నిర్మాతకు బాగా నచ్చింది. వెంటనే ‘ఓకే’ అయిపోయింది. ఇదో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అన్ని వర్గాలకూ నచ్చేలా ఉంటుంద’’న్నారు దర్శకుడు. ‘‘ఈ చిత్రంలో నా పాత్ర పేరు సిరి. అన్ని పాత్రల్నీ దర్శకుడు చాలా చక్కగా తీర్చిదిద్దార’’న్నారు మేఘా ఆకాశ్. ‘‘కథే ఈ సినిమాకి హీరో. మేఘా ఆకాశ్ నటన ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంద’’ని నిర్మాత తెలిపారు.