‘డీజే టిల్లు’లో రాధికగా ఆకట్టుకొన్న నేహా.. ‘బెదురులంక’లో మెరిసింది. ఇప్పుడు కిరణ్ అబ్బవరంతో కలిసి ‘రూల్స్ రంజన్’లో నటించారు. ఈవారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నేహా మాట్లాడుతూ.......‘‘నా కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమా ‘డీజే టిల్లు’. అందులో రాధికగా నటించాను. ఎక్కడికి వెళ్లినా అదే పేరుతో పిలుస్తున్నారు. ఇలాంటి గౌరవం ఓ నటిగా నాకు దక్కడం నా అదృష్టం. ‘రూల్స్ రంజన్’లో నా పాత్ర చాలా కొత్తగా ఉండబోతోంది. ఇందులో సనా పాత్రలో నటించాను. రాధికకూ, సనాకు ఏమాత్రం పోలికలు ఉండవు’’. ‘‘నేహా తిరుపతి అమ్మాయి. తనకు స్వార్థం ఉండదు. ప్రపంచాన్ని అన్వేషించాలనుకొంటుంది. పాత్ర పరంగా కొంత గ్లామర్ కూడా ఉంటుంది. ‘సమ్మోహనుడా’ పాట నాకు బాగా నచ్చింది. ఈ పాట కోసం చాలా కష్టపడ్డాను. అంతకు మించిన ప్రతిఫలం లభించింది. సంగీత దర్శకుడు అమ్రిష్ చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు’’. ‘‘కిరణ్ అబ్బవరం చాలా సాఫ్ట్. ఎదగాలన్న తపన ఉన్న హీరో. నేను పని చేసిన హీరోలంతా అంతే. అందరిలోనూ వృత్తి పట్ల నిబద్దత చూశాను. కిరణ్ సెట్లో చాలా కూల్‌గా ఉంటాడు. నేను మాత్రం రివర్స్. చాలా హైపర్‌గా కనిపిస్తా’’. ‘‘డీజే టిల్లు సీక్వెల్ వస్తోంది. అందులో నేను నటిస్తున్నానా, లేదా? అని చాలామంది అభిమానులు అడుగుతున్నారు. ఈ విషయంలో నేను ఇప్పుడేం చెప్పలేను. దర్శక నిర్మాతలే దీనిపై స్పందించాలి’’ అని తెలిపారు.