నా మైండ్ సెట్ కి పూర్తి భిన్నమైన పాత్రని ‘టైగర్ నాగేశ్వరావు’లో పోషించా. ఇది నాకు విచిత్రమైన అనుభవం’’ అన్నారు గాయత్రీ భరద్వాజ్. ఆమె కథానాయికగా నటించిన చిత్రమిది. రవితేజ హీరో. ఈనెల 20న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా శనివారం గాయత్రీ భరద్వాజ్ హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘‘ఈ చిత్రంలో మణి అనే పాత్రలో నటించా. పల్లెటూరి అమ్మాయిని. చాలా రఫ్ అండ్ టఫ్‌గా కనిపిస్తా. దర్శకుడు నాకు మూడు గంటల కథ చెప్పారు. నా పాత్ర గురించి వివరిస్తున్నప్పుడే నాకు కన్నీళ్లొచ్చాయి. అంత ఎమోషన్ ఉంది. నా పాత్రలో చాలా కోణాలు కనిపిస్తాయి. నటిగా ఛాలెంజింగ్‌గా అనిపించింది. అందుకే ఒప్పుకొన్నా. దాదాపు అరవైమందిని ఆడిషన్ చేశాక నాకు ఈ అవకాశం ఇచ్చారు. అందుకే మరింత గర్వంగా అనిపిస్తోంది. రవితేజలాంటి పెద్ద హీరోతో నటించడం నా అదృష్టం. ఆయన కామెడీ టైమింగ్ అద్భుతం. సెట్లో ఆయన సహకారం మర్చిపోలేనిది. ఈ పాత్ర విషయంలో దర్శకుడ్ని పూర్తిగా నమ్మాను. ఆయన ఏం చెబితే అది చేశాను. అందుకే ఈ పాత్రకు ఎంత మంచి పేరొచ్చినా క్రెడిట్ మొత్తం దర్శకుడికే ఇస్తా. ఈ సినిమాలో ఎవరూ ఊహించని యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. మాస్‌కి బాగా నచ్చుతుంది. ‘టైగర్ నాగేశ్వరరావు’ గురించి నాకు అస్సలు తెలీదు. దర్శకుడు చెప్పిన తరవాత.. అసలు ఇలాంటి దొంగలు కూడా ఉంటారా? అని ఆశ్చర్యపోయా. తెరపై ‘టైగర్’ని చూస్తున్నప్పుడు ప్రేక్షకులకూ అలాంటి ఫీలింగ్ కలుగుతుంద’’న్నారు.