యంగ్ హీరో, కన్నడ అల్టిమేట్ స్టార్ తేజ్ నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘డ్యూడ్’. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్లో సెట్స్‌కు వెళ్లనుంది. తెలుగు - కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని పనరోమిక్ స్టూడియోస్ పతాకంపై హీరో తేజ్ నిర్మిస్తుండడమే కాకుండా.. స్వయంగా కథను అందించి, దర్శకత్వం వహిస్తుండడం విశేషం. తేజ్ ఇంతకుముందు ‘రామాచారి’ అనే కన్నడ హిట్ చిత్రంలో నటించారు. ఆయన నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘గాడ్’ కూడా త్వరలోనే మొదలు కానుంది. ‘డ్యూడ్’ విషయానికి వస్తే.. ఇప్పటివరకు కొన్ని వేల ప్రేమ కథా చిత్రాలు వచ్చాయి. కానీ పూర్తి ఫుట్ బాల్ నేపథ్యంలో ఇప్పటివరకు తెలుగు, కన్నడ భాషల్లో సినిమా రాలేదు. అందువల్లే... కర్ణాటకలోని కిక్ స్టార్ట్ అనే సుప్రసిద్ధ ఫుట్ బాల్ క్లబ్.. ‘డ్యూడ్’ చిత్రానికి పూర్తి సహాయసహకారాలు అందిస్తోందని.. హృద్యమైన ప్రేమకథ ఇందులో ఉంటుందని, ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యే అంశాలతో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లుగా తేజ్ చెప్పుకొచ్చారు.