విక్రాంత్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘స్పార్క్ లైఫ్’ . మెహరీన్, రుక్సర్ థిల్లాన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి కథను అందిస్తూ స్క్రీన్‌ప్లేను అందించారు విక్రాంత్. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లీల ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 17న ఈ చిత్రం విడుదల కాబోతోన్న సందర్భంగా హీరోయిన్ మెహరీన్ మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.ఆమె మాట్లాడుతూ.. ‘‘కొత్తవాళ్లు, అనుభవం ఉన్న ఆర్టిస్టులతో కలిసి పని చేసే క్రమంలో చాలా విషయాలు నేర్చుకుంటాం. స్పార్క్ సినిమాతో హీరోగా, దర్శకుడిగా పరిచయం అవుతున్న విక్రాంత్ .. నాతో కలిసి నటించాలని ఉందని చెప్పారు. ఈ మూవీ స్క్రిప్ట్ విన్నాను, నచ్చింది.. వెంటనే ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పాను. హీరో విక్రాంత్ స్పార్క్ మూవీ కోసం చేసిన రీసెర్చ్ నన్ను ఆకట్టుకుంది. నా పాత్ర, లుక్ కొత్తగా ఉంటుందని చెప్పారు. నేను ఇంకా సినిమా చూడలేదు. కానీ.. పాటలు చూశాను. నా లుక్, పాటలను తెరకెక్కించిన విధానం నన్నెంతో ఆకట్టుకుంది. విక్రాంత్ తను చెప్పిన మాటను నిలబెట్టుకున్నారని అర్థమైంది. ఈ సినిమాలో నేను లేఖ పాత్రలో కనిపిస్తాను. ఎంతో ఇంపార్టెన్స్ ఉన్న రోల్ నాది. సినిమా నాతోనే స్టార్ట్ అవుతుంది. నాతోనే ఎండ్ అవుతుంది. ఇలాంటి థ్రిల్లర్‌లో నటించటం నాకు కూడా కొత్తగా అనిపించింది. ప్రతీ మనిషి జీవితంలో ఉన్నతి స్థాయికి ఎదగాలనే కలలు కంటుంటారు. నేను కూడా అంతే. కన్న కలలను నిజం చేసుకునే క్రమంలోనే ఎవరైనా ముందుకు వెళతారు. నేను కూడా అంతే. ఈ సినిమాలో నేను చేసిన లేఖ పాత్ర కూడా అలాగే ఉంటుంది. అందుకనే నేను కనెక్ట్ అయ్యాను. యు.ఎస్‌లో జరిగిన కొన్ని నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని విక్రాంత్ కథను తయారు చేశారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేసి థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు. విక్రాంత్ అమెరికాలో మంచి పొజిషన్‌లో సెటిలయ్యారు. కానీ తనకు సినిమా చేయాలనే డ్రీమ్ ఉండటంతో దాన్ని పూర్తి చేసుకోవటానికి ఇక్కడకు వచ్చారు. ముందు వేరే డైరెక్టర్ అనుకున్నారు. కానీ.. చివరకు విక్రాంతే సినిమాను డైరెక్ట్ చేశారు. ఓ వైపు తొలిసారి హీరోగా చేస్తూనే డైరెక్షన్ చేయటం అనేది ఎంతో కష్టంతో కూడుకున్న పని. కానీ విక్రాంత్ ఎంతో హార్డ్ వర్క్ చేసి సినిమాను కంప్లీట్ చేశారు. ఓ డెబ్యూ హీరో ఇంతలా కష్టపడటం మామూలు విషయం కాదు.. తను డెబ్యూ హీరోగా, డైరెక్టర్‌గా మెప్పిస్తారు. ప్రతీ సినిమా నటిగా నాకెంతో ప్రత్యేకమైనదే. స్క్రిప్ట్, రోల్ నచ్చినప్పుడే ఓకే చేస్తాను. అది కెరీర్ పరంగానూ ఎంతో హెల్ప్ అవుతుంది. నన్ను ఇష్టపడేవారు, ప్రేక్షకులే నాకు స్ఫూర్తిగా నిలుస్తుంటారు. నటిగా నేను చేస్తున్న పాత్రకు రెండు వందల శాతం న్యాయం చేయటానికి ప్రయత్నిస్తాను. నేను ఏదైనా ఈవెంట్స్‌కి వెళ్లినప్పుడు, నా సినిమా ప్రమోషన్స్‌లో ఉన్నప్పుడు ఎవరైనా నా క్యారెక్టర్ పేరుతో నన్ను పిలిస్తే నాకెంతో హ్యాపీగా ఉంటుంది. అదే నాకు ‘స్పార్క్’ మూమెంట్‌గా అనిపిస్తుంది. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా షూటింగ్ చేశాను. అది కూడా థ్రిల్లర్ మూవీనే. వసంత్ రవి హీరో. ఆ డైరెక్టర్ కూడా డెబ్యూ డైరెక్టరే. కచ్చితంగా ఆ సినిమా కూడా అందరినీ మెప్పిస్తుందని భావిస్తున్నాను.