కోలీవుడ్ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ్ కాంత్ గత నెలాఖరున తీవ్ర అనారోగ్యంతో చెన్నైలోని ఎం.ఐ.ఒ.టి ఇంటర్నేషనల్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. దాదాపు రెండు వారాల నుంచి చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. మరోవైపు డీఎండీకే పార్టీ కూడా ప్రకటన విడుదల చేసింది. సోమవారం ఉదయం విజయకాంత్ ఇంటికి చేరుకున్నారని తెలిపింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో కుటుంబ సభ్యులు విజయకాంత్‌ను గత నెలాఖరున ఆస్పత్రిలో చేర్పించారు. డయాబెటిస్ కారణంగా గతంలో ఆయన కుడికాలి మూడు వేళ్లను తొలగించిన విషయం తెలిసిందే. ‘ఇనిక్కుం ఇలామై’తో నటుడిగా కెరీర్ ప్రారంభించిన విజయకాంత్ సుమారు 100కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించారు. 20కి పైగా పోలీస్ కథల్లోనే ఆయన నటించి మెప్పించారు. 100వ చిత్రం ‘కెప్టెన్ ప్ఘ్రభాకర్ విజయం సాధించిన తర్వాత నుంచి అందరూ ఆయన్ని కెప్టెన్‌గా పిలుస్తున్నారు. విజయకాంత్ నటించిన చాలా చిత్రాలు తెలుగులో కూడా అనువాదమై విడుదల కావడంతో ఇక్కడి ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితులే.