బిగ్ బాస్-7 ఫైనల్స్ రోజున జరిగిన విధ్వంసం ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు ఈవెంట్ నిర్వాహకులు ఎండెమోల్షైన్ ఇండియాకు నోటీసులు జారీ చేశారు.
ఫైనల్స్ రోజు స్టూడియోకు అభిమానులు భారీ సంఖ్యలో వచ్చినా పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు. అభిమానులు వస్తారని తెలిసినా ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. నిర్వహణకు సంబంధించి సెన్సార్ బోర్డు అనుమతులు ఉన్నాయా..? నోటీసుల్లో పలు ప్రశ్నలు సంధించారు. రెండు, మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. ఫైనల్ ఎపిసోడ్ రోజున విజేత పల్లవి ప్రశాంత్, మరో కంటెస్టెంట్ అమర్దీప్ అభిమానులు పెద్దఎత్తున చేరుకుని ఆర్టీసీ, ప్రైవేట్, పోలీసు వాహనాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.