'ఆర్ఎక్స్ 100', 'మహాసముద్రం' చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా 'మంగళవారం'. ఈ సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ తో కూడి వున్న నేపథ్యంలో వచ్చింది. థియేటర్స్ లో విడుదలై అక్కడ మంచి విజయం సాధించిన ఈ చిత్రం ఇటీవల పాపులర్ ఓటిటి డిస్నీ హాట్ స్టార్ లో కూడా విడుదలై ప్రపంచవ్యాప్త ప్రేక్షకులని కూడా అలరిస్తోంది. 'మా 'మంగళవారం', టెక్నీషియన్స్ సినిమా అని గర్వంగా చెబుతున్నాను!' అని దర్శకుడు అజయ్ భూపతి సక్సెస్ మీట్ లో చెప్పింది నిజం చేస్తూ ప్రతిష్ఠాత్మకంగా జరిగే జైపూర్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమా నాలుగు అవార్డులని గెలుచుకుంది. అందులో ఈ సినిమాలో ఒక బోల్డ్ పాత్రలో నటించిన పాయల్ రాజపుత్ కి వుత్తమ నటి అవార్డు దక్కింది. అలాగే ఈ సినిమా సాంకేతికపరంగా కూడా ఎంతో బాగుంది అని ఏకగ్రీవంగా అందరూ ఆమోదించారు. అందులో కూడా మూడు అవార్డులు ఈ సినిమా గెలుచుకుంది. చిత్ర నిర్మాతలు ముద్ర మీడియా వర్క్స్ స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ ఈ విషయాన్ని సంతోషంగా చెబుతూ అవార్డులు గెలిచిన వారి పేర్లు వెల్లడించారు.
1. ఉత్తమ నటి - పాయల్ రాజపుత్
2. ఉత్తమ సౌండ్ డిజైన్ - రాజా కృష్ణన్
3. ఉత్తమ ఎడిటింగ్ - గుళ్ళపల్లి మాధవ్ కుమార్
4. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ - ముదసర్ మొహమ్మద్
సాంకేతిక పరంగా, నిర్మాణ పరంగా మంచి విలువలున్న చిత్రంగా 'మంగళవారం' ఇప్పటికే ప్రశంసలు అందుకోగా ఈ అవార్డులు కేవలం ఆరంభం మాత్రమే ఇంకా ముందు ముందు మరిన్ని అవార్డులు గెలుచుకుంటుందని తమ ఆనందం వ్యక్తం చేసారు చిత్ర దర్శకుడు, నిర్మాతలు.