తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హైదరాబాద్లో సందడి చేస్తున్నారు. తన సినిమా 'వేట్టయాన్' షూటింగ్ నిమిత్తం రజినీకాంత్ హైదరాబాద్ వచ్చారు. నిన్న అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరగగా, ఈరోజు నాగోల్ సమీపంలో షూటింగ్ చేయనున్నారని తెలుస్తోంది. ఇందులో రజినీ ఒక పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారని టాక్. దర్శకులు జ్ఞానవేల్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
ఇదే సినిమాలో భారత లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, తెలుగు నటుడు రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నారు. అమితాబ్ ఇంతకుముందే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారని, ఇక్కడ కొన్ని సన్నివేశాల్లో షూటింగ్ కూడా చేశారని, అలాగే రానా దగ్గుబాటి కూడా ఈసారి షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. ఇంతకుముందు అమితాబ్ బచ్చన్, రజినీకాంత్ పై తిరువనంతపురం లో కూడా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు.