ప్రముఖ గాయని, పద్మభూషణ్ గ్రహీత పి.సుశీల అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను హుటాహుటిన చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు.ప్రస్తుతం పి. సుశీల వయసు 86 సంవత్సరాలు. వయో భారంతో పాటు గత కొంతకాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు పి సుశీల. శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా ఆమె అస్వస్థతకు గురయ్యారు. చెన్నై కావేరి ఆస్పత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం సుశీల కడుపునొప్పితో భాదపడుతున్నారని, అయితే అది సాధారణ కడుపు నొప్పెనని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని తెలిపాయి. సుశీల ఆరోగ్యం గురించి ఎవరు ఆందోళన చెందొద్దని ఆమె కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆమె త్వరగా కోలుకుని తిరిగి రావాలని, ఆరోగ్యంగా ఉండాలని ఆమె సన్నిహితులు, అభిమానులు ప్రార్థిస్తున్నారు.
కాగా పి సుశీల పూర్తి పేరు పులపాక సుశీల. విజయనగరంలో 1935 నవంబరు 13న పి.ముకుందరావు, శేషావతారం దంపతులకు జన్మించారు. సుశీల 1950 నుండి 1990 వరకు దక్షిణ భారతదేశంలో నేపథ్య గాయకురాలిగా కీర్తిప్రతిష్టలు అందుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, బడుగ, సింహళ భాషలలో 50 వేలకు పైగా గీతాలు పాడారు . ఆమె మాతృభాష తెలుగు అయినప్పటికీ కొద్దిగా హిందీ, కన్నడ భాషలలో మాట్లాడగలరు. తమిళ భాషను తెలుగు మాట్లాడినంత సరళంగా మాట్లాడగలరు. పి. సుశీల సంగీత ప్రపంచానికి అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఉత్తమ గాయనిగా ఐదు జాతీయ పురస్కారాలు అందుకున్నారు పి. సుశీల.